
భారత్‌లో ఉద్యోగుల ప్రాధాన్యాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏఓఎన్ 2025 ఎంప్లాయ్ సెంటిమెంట్ స్టడీ ప్రకారం ఈ ఏడాది దేశంలో 82 శాతం మంది తాము చేస్తున్న సంస్థలు మారాలని భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 60 శాతంగా ఉంది. మెరుగైన పనిప్రాంత ప్రయోజనాలు, కెరీర్ అవకాశాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఈ ధోరణి నొక్కి చెబుతుంది.
ప్రయోజనాలకే ప్రాధాన్యత
ఏఓన్ రిపోర్ట్‌లోని అంశాల ప్రకారం.. భారతీయ ఉద్యోగులు 76 శాతం మంది తమ అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసం ప్రస్తుతం ఉన్న వెసులుబాట్లను విడిచిపెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగులకు కోరుకునే ఐదు అత్యంత విలువైన ప్రయోజనాలను విశ్లేషించింది.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్‌లు: ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్‌మెంట్లు, రిమోట్ వర్క్ ఆప్షన్ల కోసం ఉద్యోగులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు.
మెడికల్ కవరేజ్: ఆసుపత్రిలో చేరడం, అవుట్ పేషెంట్ సేవలు వంటి ఆరోగ్య సంరక్షణ చర్యలు మెరుగ్గా ఉన్న కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
కెరీర్ డెవలప్‌మెంట్ అవకాశాలు: ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతోపాటు మెరుగైన ఉద్యోగావకాశాల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, మెంటార్‌షిప్, లీడర్ షిప్ ట్రైనింగ్ వంటి సదుపాయాలు కోరుకుంటున్నారు.
వేతనంతో కూడిన సెలవులు: పెయిడ్ సెలవులు, పేరెంటల్ లీవ్, వెకేషన్ల కోసం సెలవులు ఇచ్చే కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు.
రిటైర్మెంట్ పొదుపు పథకాలు: పెన్షన్ పథకాలు, ఆర్థిక స్థిరత్వాన్ని పొందడానికి పెట్టుబడి అవకాశాలకు పెద్దపీట వేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 13 శాతం మంది ఉద్యోగులతో పోలిస్తే భారత్‌లో కేవలం 7 శాతం మంది మాత్రమే తక్కువ సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే భావనతో ఉంటున్నారు.
వైద్య కవరేజ్ తరతరాలుగా అత్యధిక విలువ కలిగిన ప్రయోజనాల్లో ఒకటిగా ఆవిర్భవించింది. జెన్ ఎక్స్(1965-80 మధ్య జన్మించినవారు), జెన్ వై(1980-1995 మధ్య జన్మించినవారు) జెన్ జెడ్(1995-2005 మధ్య జన్మించినవారు) కంటే ఎక్కువగా వైద్య సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జెన్ జెడ్ ఉద్యోగులు వర్క్-లైఫ్ సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లకు ప్రాముఖ్యత
కొవిడ్ తర్వాత కంపెనీలు తమ బ్రాండ్‌ను రూపొందించడంలో వెల్‌నెస్ ప్రోగ్రామ్‌ల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నాయని ఏఓఎన్‌లోని టాలెంట్ సొల్యూషన్స్ ఫర్ ఇండియా హెడ్ నితిన్ సేథీ పేర్కొన్నారు. మెరుగైన ఆరోగ్యం, వెల్‌నెస్, ఫైనాన్షియల్ ప్లానింగ్ సొల్యూషన్స్‌ను తమ పాలసీల్లో పొందుపరిచేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఉద్యోగులను నిలుపుకోవడానికి, టాప్ టాలెంట్‌ను ఆకర్షించడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తుందని చెప్పారు.
యువ నిపుణుల్లో పదవీ విరమణ, ఆర్థిక ప్రణాళిక అంశాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయని ఏఓఎన్ హెల్త్ అండ్ వెల్త్ సొల్యూషన్స్ హెడ్ యాష్లే డిసిల్వా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, స్తబ్దుగా ఉన్న వేతనాల ఆందోళనలే ఈ మార్పుకు కారణమని చెప్పారు. ఇది ఉద్యోగులు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టడానికి దారితీస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: క్షిపణి దాడి.. మే 8 వరకు విమానాల నిలిపివేత
అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి 43% మంది భారతీయ ఉద్యోగులు తమ ఏఐ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ఏఓఎన్ అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి 35 శాతంగా ఉంది. 10 శాతం మంది ఉద్యోగులు తమ నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ కోసం వారి సంస్థలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెప్పారు.