
అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఎయిరిండియా ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి రాకపోకలు సాగిస్తున్న విమాన సర్వీసులను మే, 8 వరకు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన క్షిపణి దాడి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దాంతో ఎయిరిండియా ఢిల్లీ-టెల్ అవీవ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఏఐ 139ను ఇటీవల అబుదాబికి మళ్లించినట్లు తెలిపింది. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి కారణంగా ఇజ్రాయెల్-యెమెన్ ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.
క్షిపణి దాడి
యెమెన్‌కు చెందిన హౌతీలు హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణితో ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో దాడికి పాల్పడ్డారు. దాంతో విమానాశ్రయం సమీపంలో టెర్మినల్ 3 పార్కింగ్ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. మే 4న జరిగిన ఈ దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. బోయింగ్ 787కు చెందిన ఎయిరిండియా విమానం ఏఐ139 ల్యాండ్ అవ్వడానికి గంట ముందు ఈ సంఘటన జరిగింది. ఫ్లైట్‌రాడార్24.కామ్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం విమానం జోర్డాన్ గగనతలంలో ఉందని, దాడి సమాచారం తెలిసిన వెంటనే దాన్ని అబుదాబికి మళ్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: సాంకేతికతతో యుద్ధానికి సై
ఎయిరిండియా స్పందన
మే 4న జరిగిన ఈ సంఘటనకు ప్రతిస్పందనగా ఎయిరిండియా మొదట టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగిస్తున్న విమానాలను మే 6 వరకు నిలిపివేసింది. అక్కడ కొనసాగుతున్న భద్రతా కారణాల వల్ల విమానాల నిలిపివేతను మే 8 వరకు పొడిగించింది. టెల్ అవీవ్‌కు ఎయిరిండియా వారానికి ఐదు విమానాలను నడుపుతోంది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు సంస్థ తెలిపింది. క్షేత్రస్థాయిలో సంస్థ బృందాలు ప్రభావిత ప్రయాణీలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.