
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాటాదారులకు బోనస్ షేర్ల జారీ సహా.. ప్రత్యేక మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు ప్రతిపాదించింది. ఈ నెల 19న(శనివారం) నిర్వహించనున్న సమావేశంలో బోర్డు ఈ అంశాన్ని పరిశీలించనున్నట్లు బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక (ఏప్రిల్–జూన్) ఫలితాలను సైతం శనివారం సమావేశంలో బ్యాంక్ ప్రకటించనుంది. కాగా.. గతేడాది(2024–25)కి ప్రచురించిన వార్షిక నివేదికలో పరిశ్రమకు అనుగుణంగా ఈ ఏడాది రుణాల్లో వృద్ధి నమోదుకానున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ పేర్కొన్నారు.
రుణ రేట్లను తగ్గించిన ఐవోబీ
ప్రభుత్వరంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్) 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) మేర తగ్గించినట్టు ప్రకటించింది. అన్ని రకాల కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్‌ఆర్ రుణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.
జూలై 15 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. సవరణ అనంతరం ఓవర్‌నైట్ కాల వ్యవధి ఎంసీఎల్‌ఆర్ 8.15 శాతం, ఒక నెల ఎంసీఎల్‌ఆర్ 8.40%, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ 8.55 శాతం, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ 8.80 శాతం, ఏడాది ఎంసీఎల్‌ఆర్ 9 శాతానికి దిగొచ్చాయి. ఆటో, వ్యక్తిగత తదితర కన్జ్యూమర్ రుణాలకు ఎంసీఎల్‌ఆర్‌ను బ్యాంకులు అమలు చేస్తుంటాయి.