
ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) హేతుబద్ధీకరణపై కొందరిలో ఆందోళనలు నెలకొంటుంటే, ఇంకొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులున్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచకుండా ఇటువంటి క్రమబద్ధీకరణకు పూనుకొని ఒకింత ప్రజల మన్ననలు పొందడంపై ప్రభుత్వం విజయం సాధించిందనే చెప్పాలి.
గందరగోళం నుంచి స్థిరత్వం వైపు..
2017లో ప్రారంభించిన జీఎస్టీలో ప్రాథమికంగా సాంకేతిక లోపాలు, గందరగోళం, రాజకీయ విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రాలకు చెల్లించే పరిహారంపై తీవ్ర దుమారమే రేగింది. కేంద్రం రాష్ట్రాల పన్ను వాటాను హరిస్తుందనే వాదనలొచ్చాయి. కానీ కాలక్రమేణా జీఎస్టీ వ్యవస్థ బలపడుతూ వారిని కట్టడి చేయగలిగింది. తాజాగా జీఎస్టీ నిర్మాణంపై కీలక సూచికలు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. ఏటా నెలవారీ జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2018లో 1 కోటి(యాక్టివ్ రిజిస్ట్రేషన్స్) నుంచి 2025 నాటికి 1.5 కోట్లకు విస్తరించింది. ఈ-ఇన్వాయిసింగ్, ఈ-వే బిల్లులు, డిజిటల్ రిటర్న్ ఫైలింగ్స్.. వంటి వ్యవస్థల ద్వారా మద్దతు లభించింది.
గృహ వినియోగదారులకు ఉపశమనం
జీఎస్టీ శ్లాబుల హేతుబద్ధీకరణతో విస్తృతంగా వినియోగించే వస్తువులు, అవసరమైన సేవలపై భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తద్వారా గృహాలకు ప్రత్యక్ష ఉపశమనం కలిగిస్తుంది. గృహ వినియోగ వ్యయ సర్వే అంచనాల ప్రకారం.. టాప్ 30 గృహ వినియోగ వస్తువులపై సాధారణ సగటు జీఎస్టీ రేటు 11% నుంచి 9%కి పడిపోయింది. ముఖ్యంగా పండుగ సీజన్‌కు ముందు ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. అదే సమయంలో లగ్జరీ వస్తువులు, సిన్‌గూడ్స్, ప్రీమియం ఉత్పత్తులు ఉపయోగించే వర్గాలకు అధిక జీఎస్టీ రేట్లను విధించింది.
ఆదాయ నష్టం..
రేట్ల తగ్గింపు ఆదాయ నష్టానికి, ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే గృహాలు, నిత్యావసరాలపై తక్కువ పన్ను ఉండడంతో కొనుగోలు శక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అధిక వాల్యూమ్‌లు క్రియేట్ అవుతుండడంతో ద్రవ్యోల్బణం కూడా సానుకూలంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భారీగా వినియోగించే వస్తువులపై జీఎస్టీని తగ్గించడం ద్వారా రిటైల్ ధరల సూచిక సానుకూలంగా స్పందిస్తుందనే అభిప్రాయలున్నాయి.
అయినా కొందరు..
ఇదిలా ఉండగా, ప్రభుత్వ నిర్ణయం మెజారిటీ వర్గానికి మేలు చేసేదైనప్పటికీ కొన్నిచోట్ల రిటైలర్లు, దుకాణాదారులు ఇంకా కొత్త రేట్లను వినియోగదారులకు అందించడం లేదు. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, నిత్యం తనిఖీలు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. దాంతోపాటు జీఎస్టీపై ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే వ్యవస్థను పటిష్టపరచాలని చెబుతున్నారు.
ఇదీ చదవండి: మస్క్ కుమార్తె వద్ద డబ్బు లేదంటా..!