
2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు గోల్డ్ రేటు 23 శాతం పెరిగింది. ఏప్రిల్ నెలలో మాత్రమే పసిడి ధర 5 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. శనివారం నాటికి బంగారం ధరలు గరిష్టంగా రూ. 95,670 వద్ద నిలిచాయి.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. ట్రాయ్ ఔన్సుకు $3,263 రికార్డు గరిష్ట స్థాయిని తాకిన తర్వాత కామెక్స్ గోల్డ్ 2.44 శాతం పెరిగి $3,254.90 వద్ద ముగిసింది. ఇప్పటి వరకు బంగారం ధరలు పెరుగుదల ఆల్ టైమ్ రికార్డ్ అని తెలుస్తోంది.
బంగారం రేటు ఎందుకు పెరుగుతోంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్.. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అనేక దేశాలపై విధించిన పరస్పర సుంకాలకు 90 రోజుల విరామం ప్రకటించగా.. చైనాపై సుంకాలను మాత్రం 125 శాతానికి పెంచారు. చైనా కూడా ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా.. అమెరికా వస్తువులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వృద్ధి చుట్టూ అనిశ్చితిని పెంచాయి. దీంతో బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.
స్టాక్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులకు గ్యారెంటీ లేదు. కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెడితే.. అది సురక్షితమైన ఆస్తిగా భావించేవారు సంఖ్య గణనీయంగా పెరగడంతో.. ఎక్కువమంది బంగారం కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇది గోల్డ్ రేటు పెరగడానికి దోహదపడుతున్నాయి.
ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. 200 మంది ఉద్యోగులు బయటకు
బంగారం ధరలు తగ్గుతాయా?
వాణిజ్య యుద్ధం, డాలర్ విలువ తగ్గడం, వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ట్రాయ్ ఔన్సుకు $3,300 నుంచి $3,500 వరకు పెరుగుతాయని చెబుతున్నారు.
భారతదేశంలో 2025 చివరి నాటికి 10 గ్రాముల బంగారం రూ. 97,000 కు చేరుకుంటుందని HDFC సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ 'అనుజ్ గుప్తా' అన్నారు. ధరలు పెరుగుదల ఇలాగె కొనసాగే అవకాశం ఉందని.. ఎల్కేపీ సెక్యూరిటీస్ , కమోడిటీ అండ్ కరెన్సీ, వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది కూడా వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటు ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు లేదని స్పష్టంగా అర్థమవుతోంది.