నేను తెలంగాణ ప్రభుత్వోద్యోగిని. నా ఆదాయం రూ.5 లక్షలు. రిటర్ను వేశాను. రిటర్న్ ప్రాసెస్ అయిపోయింది. గత సంవత్సరం మా బాబాయి వ్యాపారం కోసం బంగారం మీద రూ.15,00,000 లోన్ తీసుకున్నాను. ఈ సంవత్సరం మా బాబాయి ఆ మొత్తాన్ని రిటర్న్ చేస్తే, నేను లోన్ తీర్చివేస్తాను. ఈ వ్యవహారంలోని పన్ను చిక్కులు, ఇతర చిక్కులు తెలపండి. – రమేష్ రెడ్డి, ఈ–మెయిల్ ద్వారా
మీరు ప్రభుత్వోద్యోగి. మీ సంవత్సరాదాయం రూ. 5,00,000. ఇతరత్రా ఎటువంటి ఆదాయం లేదంటున్నారు. దీనికి సంబంధించిన రిటర్ను వేశారు. అది ప్రాసెస్ అయ్యింది. ఇదే సంవత్సరం బంగారం తాకట్టు పెట్టి రూ.15,00,000 లోన్ తీసుకుని, ఆ మొత్తాన్ని మీ బాబాయికి ఇచ్చారు. ఇందులో రెండు వ్యవహారాలు ఉన్నాయి. మీరు లోన్ తీసుకోవడం మొదటిదయితే, రెండోది మీరు మీ బాబాయిగారికి అప్పు ఇవ్వడం. ఈ రెండూ బ్యాంకు ద్వారా జరిగాయని అనుకుంటున్నాం. లోన్ వచ్చినప్పుడు మీ బ్యాంకు అకౌంటులో జమ, ఆ తర్వాత మీరు మీ బాబాయికి ఇచ్చినప్పుడు ఖర్చు/డెబిట్. ఈ మేరకు కాగితాలు/డాక్యుమెంట్లు, సంతకాలు, పద్దులు ఉన్నాయి కదా! (బదులుగా రెండు నగదు వ్యవహారాలయితే మాత్రం ఎంతో ముప్పు ఉంది. నగదు తీసుకోవడం, నగదు ఇవ్వడం రెండూ తప్పే. పెనాల్టీలు పడతాయి).
ఇంతవరకు ఎటువంటి భయం లేదు. ఆ తర్వాత సంవత్సరం మీ బాబాయి మీకు చెక్కు ద్వారా ఇచ్చి, ఆ మొత్తం మీ బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అయ్యి, అటుపైన మీరు అదే మొత్తాన్ని బంగారం కంపెనీకి అప్పు తీర్చినట్లయితే, మీ అకౌంటులో డెబిట్/ఖర్చు కనబడాలి. ఇలాగే జరిగితే, ఆ మేరకు కాగితాలు, డాక్యుమెంట్లు, సంతకాలు, పద్దులు, అవసరం అయితే కాగితాల ద్వారా వివరణ, కన్ఫర్మేషన్ ఉంటే ఎటువంటి భయం లేదు. ‘లోన్’ని ఆదాయంగా పరిగణించరు. జమని ‘లోన్’గా కాగితాల ద్వారా, థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్ ద్వారా ధ్రువీకరించాలి. అలా చేస్తే ఈ వ్యవహారంలో జమల్ని ఆదాయంగా పరిగణించరు. అప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా దాన్ని ఆదాయంగా పరిగణించనవసరం లేదు. అయితే, ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఈ లావాదేవీలలో వడ్డీ ఉందా లేదా అని. వడ్డీ ఉంటే మీ ఆదాయంలో ఆ వడ్డీని ఆదాయంగా పరిగణిస్తారు. వడ్డీ లేకపోతే మీరిద్దరూ రాతపూర్వకంగా ధ్రువీకరించాలి.
నేను రాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్ అయ్యాను. పెన్షన్ వస్తుంది. నా భర్త లేనందున వారి పెన్షన్ నా ఆదాయంలో ‘ఫ్యామిలీ పెన్షన్’గా వస్తుంది. నా భర్త పెన్షన్, పన్ను భారం మొదలైన వ్యవహారాలన్నీ నా పాన్ నంబరు మీద నడుస్తున్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరం నా భర్తకు వచ్చిన ఎరియర్స్ పన్నుకి గురి కావడం వల్ల పన్ను రికవరీ చేసి ఆ మేరకు చెల్లించి నాకు ఫారం 16 ఇచ్చారు. అప్పుడు ఆ పన్ను చెల్లింపులు నా అకౌంటులో కనిపించడం లేదని, వడ్డీతో సహా చెల్లించాలని నోటీసులు పంపారు. –కె. శారద, బెంగళూరు
ఇటువంటివి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. పన్ను రికవరీలు జరిగి, గవర్నమెంటు ఖజానాకు చెల్లించినప్పటికీ ఆ మేరకు ఫారం 16లో సర్టిఫై అయినప్పటికీ, ఈ పద్దులు డిపార్టుమెంటు వారి దగ్గర వారు నిర్వహిస్తున్న 26ఏఎస్‌లో కనబడకపోతే/ఎంటర్ అవ్వకపోతే డిపార్టుమెంటు వారు పట్టించుకోరు. 26ఏఎస్‌లో కనిపించకపోతే ‘మనం చెల్లించలేదని’ వారి వాదన. అందుకే ఇటువంటి నోటీసులు పంపిస్తారు. ఇటువంటి నోటీసులు రాగానే ముందుగా నోటీసులో డిమాండ్ అంశాన్ని/భారాన్ని ఒప్పుకోకండి. ‘డూ యూ ఎగ్రీ’ అన్న ప్రశ్నకు ‘నో’ అని చెప్పండి.
ఇప్పుడు మీ భర్తగారు రిటైర్ అయిన సంస్థకు వెళ్లి సమాచారం సేకరించండి. ఫారం 16 అడగండి. అందులో అన్ని వివరణలు ఉంటాయి. ఎంత ఎరియర్స్ వచ్చాయి, పన్ను ఎంత, అది ఎలా చెల్లించారు, ఏ బ్యాంకు ద్వారా చెల్లించారు, లాన్ నంబరు, ఏ తేదీనాడు చెల్లించారు.. ఈ వివరణలతో ఫారం 16ని సేకరించి, డిపార్టుమెంటు వారి పోర్టల్‌కి వెళ్లి వివరంగా జవాబు ఇవ్వండి. డిమాండ్ నోటీసుని ఉపసంహరించమని అడగండి. డిపార్టుమెంటు వారు అవసరమైతే మిమ్మల్ని సంబంధిత అధికారులను కలవమని చెప్పవచ్చు.. లేదా వారికి నేరుగా కాగితాలను సబ్మిట్ చేయమని చెప్పవచ్చు. దీనితో మీ సమస్యలు సమసిపోవచ్చు. ఇంకా డిమాండు విత్‌డ్రా కాకపోతే ‘గ్రీవెన్స్ సెల్’కి రిపోర్ట్ చేయొచ్చు. అప్పుడు ఫారం 16 కాపీని అప్‌లోడ్ చేయొచ్చు. కాస్త సమయం పడుతుంది. అందాకా మీకు టెన్షన్ ఉండొచ్చు. కానీ ఫారం 16లోని అంశాలు కరెక్టుగా ఉన్నంత వరకు ఎటువంటి పొరపాటు జరగదు. జాప్యం ఉండొచ్చేమో .. తప్పు జరగదు. అందుకనే ఒక సలహా. ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులకు సంబంధించిన అన్ని వివరాలు, కాగితాలు, చలాన్లు మొదలైన వాటన్నింటిని ఎప్పుడూ భద్రపర్చుకోవాలి.


