లీగల్ రివ్యూను ప్రశ్నించిన‍ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మాజీ ఛైర్మన్ | Ex HDFC Bank Chairman Atanu Chakraborty Slams Legal Review Questions Governance | Sakshi
Sakshi News home page

లీగల్ రివ్యూను ప్రశ్నించిన‍ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మాజీ ఛైర్మన్

Jun 29 2026 12:44 PM | Updated on Jun 29 2026 12:54 PM

Ex HDFC Bank Chairman Atanu Chakraborty Slams Legal Review Questions Governance

దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఇటీవలి పరిణామాలు కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన రాజీనామాపై బ్యాంక్ యాజమాన్యం జరిపించిన చట్టపరమైన సమీక్షను బ్యాంక్ మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి ప్రశ్నించారు. ఈ సమీక్ష అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిందే తప్ప, ఇందులో వాస్తవాలు లేవని ఆరోపించారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు.

న్యాయ సంస్థల నివేదికపై అసంతృప్తి

తన రాజీనామా ప్రకటనను సమీక్షించడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నియమించిన బాహ్య న్యాయ సంస్థలు (External Law Firms) సమర్పించిన నివేదికను అతాను చక్రవర్తి తప్పుపట్టారు. ఈ నివేదిక కేవలం ‘పరిమిత పరిధి/షరతులతో కూడిన నివేదిక’ అన్నారు. అంతర్గత అధికారుల ఇంటర్వ్యూల నుంచి సేకరించిన కొన్ని అంశాలు, బోర్డు సమావేశాల మినిట్స్‌పైనే ఈ నివేదిక ప్రధానంగా దృష్టి సారించిందని విమర్శించారు. బ్యాంక్‌లోని కొన్ని వ్యాపార పద్ధతులకు, తన వ్యక్తిగత విలువలకూ మధ్య వచ్చిన వైరుధ్యం వల్లే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అయితే, న్యాయ సంస్థలు ఈ ప్రాథమికాంశాన్ని వదిలేసి కేవలం కొన్ని అంశాలపైనే దృష్టి పెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమీక్ష కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ‘వాడియా గాంధీ’, ‘విల్సన్ సోనీ’ అనే న్యాయ సంస్థలను నియమించినట్లు తెలుస్తోంది.

బోర్డు తీరుపై ప్రశ్నలు

‘నా నియామకం, రాజీనామా రెండూ కంపెనీల చట్టం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి లోబడే జరిగాయి. అలాంటప్పుడు ఈ సమీక్ష దేనికి? సమీక్ష కోసం న్యాయవాదులను నియమించడానికి గల నిబంధనలు లేదా చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ఏమిటో చెప్పాలని నేను బోర్డును పదేపదే కోరాను. కానీ, నా అభ్యర్థనలను బోర్డు పట్టించుకోలేదు. ఆ నిబంధనలను నాతో పంచుకోలేదు’ అని అతాను చక్రవర్తి అన్నారు.

ఈ చట్టపరమైన నివేదికలను ఆయన అనవసరమైనవిగా కొట్టిపారేశారు. తన పదవీకాలంలో జరిగిన ‘ఏటీ-1 బాండ్ మిస్‌సెల్లింగ్‌’ కేసుపై బ్యాంక్ వేగంగానే స్పందించిందని చెప్పారు. అయితే, బోర్డు రూమ్ విషయాలు బోర్డు రూమ్‌లోనే ఉండాలనే నియమానికి కట్టుబడి తన రాజీనామాకు దారితీసిన నిర్దిష్ట వ్యాపార పద్ధతులు ఏమిటనేది మాత్రం ఆయన వెల్లడించలేదు.

త్వరలో కొత్త ఎండీ, సీఈఓ

ఈ వివాదాల నడుమే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కార్పొరేట్ గవర్నెన్స్‌ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. బ్యాంకుకు శాశ్వత ఛైర్మన్ నియామకాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ జగదీషన్‌ను తిరిగి నియమించే కసరత్తును ముమ్మరం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నూతన ఛైర్మన్ ఎవరనేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇది బ్యాంక్ భవిష్యత్తు వ్యూహాలకు ఎంతో కీలకం కానుంది.

ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement