మెగా హీరో రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించగా.. జగపతి బాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు.
తాజాగా ఈ మూవీకి టాలీవుడ్ మాటల రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చారు. పరుచూరి పాఠాలు అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఒక ఊర్లో రైలు ఆగాలి అనే చిన్న పాయింట్‌తో కథను నడిపించడం అద్భుతంగా ఉందన్నారు. మూవీ చివర్లో ఇచ్చిన సందేశం తనకు నచ్చిందన్నారు.
ఒక చిన్న పాయింట్ తీసుకుని మూడు గంటల సినిమా తీయడం అంటే మాటలు కాదని అన్నారు. అయితే పెద్ది రన్‌టైమ్ విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిందని తెలిపారు. రామ్ చరణ్ కాకుండా మరెవరైనా చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని నా అభిప్రాయమని వెల్లడించారు. ఈ సినిమా మొత్తాన్ని రామ్ చరణ్ తన భుజాలపై మోశారని ప్రశంసించారు. అతని వల్లే పెద్దికి కలెక్షన్స్ వచ్చాయని పరుచూరి తెలిపారు.
పరుచూరి మాట్లాడుచూ.. 'ఓట్లే లేని ఊర్లో రైలు ఆగాలనే పాయింట్ తీసుకుని గొప్పగా రాశారు. ఎలా అయినా ఊరికి గుర్తింపు తీసుకురావాలని హీరో క్రికెట్, కుస్తీల్లో ఓడిపోయినప్పటికీ.. చివర్లో రన్నింగ్‌లో సత్తా చాటి తన పోరాటంలో అనుకున్నది సాధించాడు. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ వేషధారణలు ఏవీ తెలుగు వాళ్లకు నచ్చేలా లేకపోవడం పెద్ద మైనస్. హీరోయిన్ పాత్ర నిడివి చాలా తక్కువ. ఈ మూవీ రన్‌టైమ్ ఇంకా 30 నుంచి 40 నిమిషాల వరకు తగ్గించే అవకాశం ఉంది. నిడివి తగ్గించి హీరోయిన్ పాత్ర ఎక్కువ చూపించి ఉంటే ఓటీటీలో ఇంకా ఆదరణ దక్కేదేమో' అని అన్నారు.


