భారత ప్రభుత్వం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను సాధించేందుకు పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే E20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) వైపు అడుగులు వేసిన ప్రభుత్వం, భవిష్యత్తులో E22, E25, E27, E30 వంటి అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాలకు కూడా మార్గం సుగమం చేస్తోంది. ఈ పరిణామాలు దేశంలోని వాహన కొనుగోలుదారుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి.
ఇటీవల ప్రభుత్వం 22 నుంచి 30 శాతం వరకు ఇథనాల్ కలిగిన పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఇవ్వడం ద్వారా అధిక ఇథనాల్ వినియోగానికి మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఇంధనాలు మార్కెట్లో అందుబాటులో లేకపోయినా, వాటి ప్రమాణాలను ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేయడం గమనార్హం.
ఈ నేపథ్యంలో.. వాహన కొనుగోలుదారుల్లో అనిశ్చితి నెలకొంది. భవిష్యత్తులో అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం కొనుగోలు చేసే పెట్రోల్ వాహనాలు వాటికి అనుకూలంగా ఉంటాయా?, లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై నిర్వహించిన సర్వేలో 28 వేలకుపైగా మంది పాల్గొన్నారు. వారిలో 43 శాతం మంది E20, E30 వంటి ఇంధనాల భవిష్యత్ ప్రభావాల కారణంగా వచ్చే ఏడాది కొత్త వాహనాల కొనుగోలును వాయిదా వేయాలని లేదా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవచ్చని తెలిపారు.
సర్వేలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం 6 శాతం మంది మాత్రమే కొత్త పెట్రోల్ వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు 7 శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), 7 శాతం మంది హైబ్రిడ్ వాహనాలను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపించారు. అంటే పెట్రోల్ వాహనాలతో పోలిస్తే EVలు, హైబ్రిడ్ వాహనాలపై ఆసక్తి రెట్టింపుకన్నా ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.
ఇంధన భవిష్యత్తుపై అనిశ్చితి, పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి కారణాల వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఫలితంగా ప్రముఖ ఈవీ మోడళ్లకు వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగింది.
దేశవ్యాప్తంగా EVల వినియోగం కూడా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోషియేషన్ (FADA) గణాంకాల ప్రకారం, 2026 మే నెలలో మొత్తం వాహన అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 11 శాతాన్ని దాటింది. అదే నెలలో EVల రిటైల్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 45 శాతం పెరిగి 2.71 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ 81 శాతం పెరగడం ఈ రంగంలో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం.


