ఈపీఎఫ్‌ క్లెయిమ్‌లకు వేగంగా ఆమోదం | EPFO improved its claim settlement process within three days | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ క్లెయిమ్‌లకు వేగంగా ఆమోదం

Jun 13 2025 8:32 AM | Updated on Jun 13 2025 9:03 AM

EPFO improved its claim settlement process within three days

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) క్లెయిమ్‌ల పరిష్కారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత వేగాన్ని సంతరించుకుంది. క్లెయిమ్‌ దరఖాస్తుల్లో 50 శాతాన్ని (ప్రధానంగా ఉపసంహరణ) మూడు రోజుల్లోనే పరిష్కరించినట్టు ఓ అధికారి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇలా మూడు రోజుల్లోనే పరిష్కరించిన క్లెయిమ్‌లు 39 శాతంగా ఉన్నట్టు చెప్పారు.

2025 ఏప్రిల్‌ నుంచి జూన్‌ 5 మధ్య 68.96 లక్షల క్లెయిమ్‌లకు మూడు రోజుల్లో పరిష్కారం లభించింది. ప్రస్తుతం రూ.లక్ష వరకు క్లెయిమ్‌లకు ఆటోమేటెడ్‌ పరిష్కారం అమల్లో ఉండగా, ఈపీఎఫ్‌వో త్వరలోనే రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లకు ఈ పరిమితిని పెంచనుంది. దీంతో మరిన్ని క్లెయిమ్‌లకు వేగంగా పరిష్కారం లభించనుందని ఆ అధికారి తెలిపారు. ఈ పరిమితి పెంపునకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఆమోదం అవసరం లేదన్నారు. సెంట్రల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ ఇందుకు అనుమతించొచ్చని చెప్పారు.

ఇదీ చదవండి: అమెరికా బడ్జెట్‌ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..!

అనారోగ్యం, విద్య, ఇంటి నిర్మాణం/కొనుగోలు, వివాహ అవసరాలకు సంబంధించిన క్లెయిమ్‌లు రూ.లక్ష వరకు ఉండి, దరఖాస్తుదారులకు అర్హతలు ఉంటే వాటికి మూడు రోజుల్లోనే క్లెయిమ్‌ మొత్తం మంజూరవుతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా 2012కు ముందు చేరిన సభ్యుల క్లెయిమ్‌ల ధ్రువీకరణకు సమయం తీసుకుంటున్నట్టు తెలిపారు. పెన్షన్, గ్రూప్‌ ఇన్సూరెన్స్, ఈపీఎఫ్‌ ఉపసంహరణలు అన్నింటినీ 72 గంటల్లోనే పరిష్కరించాలన్నది ఈపీఎఫ్‌వో లక్ష్యమని.. ఈ దిశగా ఈపీఎఫ్‌వో కృషి చేస్తున్నట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement