దుమ్మురేపనున్న ఆన్‌లైన్ అమ్మకాలు, పండగ సీజన్‌లో రూ.90వేల కోట్ల బిజినెస్‌ | E-commerce To Touch Rs90,000 Crore This Festive Season | Sakshi
Sakshi News home page

దుమ్మురేపనున్న ఆన్‌లైన్ అమ్మకాలు, పండగ సీజన్‌లో రూ.90వేల కోట్ల బిజినెస్‌

Sep 17 2023 7:51 AM | Updated on Sep 17 2023 10:39 AM

E-commerce To Touch Rs90,000 Crore This Festive Season - Sakshi

మూడేళ్ల తర్వాత కొవిడ్‌ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో.. వినియోగదారుల నుంచి డిమాండ్‌ పెరిగింది. వెరసీ గత ఏడాదితో పోలిస్తే రాబోయే పండగ సీజన్‌లో ఆన్‌లైన్‌ విక్రయాలు గ్రాస్‌ మెర్చండైజ్‌ వ్యాల్యూ 18- 29 శాతం వృద్దితో రూ.90,000 కోట్లకు చేరుకోవచ్చంటూ ప్రముఖ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ రెడ్‌సీర్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌ అంచనా వేసింది.  

ఆయా ఈ- కామర్స్‌ సంస్థలు నిర్వహించే ఫెస్టివల్‌ సేల్స్‌ అధికారిక తేదీలు ఇంకా బహిర్ఘతం కానప్పటికీ, ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్', అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' విక్రయాలు అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమవుతాయని అంచనా. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఇ-కామర్స్ అమ్మకాలు గణనీయమైన వృద్ధిని సాధించినప్పటికీ, ఈ రంగం గత రెండు త్రైమాసికాల్లో నామ మాత్రపు ఫలితాల్ని రాబట్టింది.

జనవరి-జూలై 2023 కాలంలో, జీఎంవీ మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 10 శాతం పెరిగింది. ఏది ఏమైనప్పటికీ, కొవిడ్‌ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో, రాబోయే పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. 

ఈ పండగ విక్రయాల్లో దాదాపు 14 కోట్ల మంది పాల్గొనవచ్చని, వీరు కనీసం ఒక్కసారి అయినా కొనుగోళ్లు చేసే అవకాశం ఉందని వివరించింది. భారత ఇ-కామర్స్‌ సంస్థలు ప్రత్యేక పండగ విక్రయాలు ప్రారంభించి 2023కు పదేళ్లు పూర్తికానుంది. ఈ సమయంలో భారత ఇ-కామర్స్‌ స్థూల మర్చండైజ్‌ విలువ (జీఎంవీ) దాదాపు 20 రెట్లు వృద్ధి చెందింది. వార్షిక కొనుగోలుదార్ల సంఖ్య దాదాపు 15 రెట్లు అధికమైంది.

2014లో ఇ-కామర్స్‌ పరిశ్రమ పూర్తి ఏడాదిలో రూ.27,000 కోట్ల జీఎంవీ నమోదు చేయగా.. 2023లో దాదాపు రూ.5.25 లక్షల కోట్ల జీఎంవీకి చేరే అవకాశం ఉంది. ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో బ్యూటీ,  వ్యక్తిగత సంరక్షణ, గృహ,  ఫ్యాషన్, సాధారణ వస్తువుల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని రెడ్‌సీర్‌ నివేదిక హైలెట్‌ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement