పని మనిషికి రూ.83 లక్షల జీతం.. | Dubai agency offering Rs 83 lakh salary for a housemaid | Sakshi
Sakshi News home page

పని మనిషికి రూ.83 లక్షల జీతం..

May 2 2025 1:10 PM | Updated on May 2 2025 1:21 PM

Dubai agency offering Rs 83 lakh salary for a housemaid

సాధారణంగా ఇళ్లలో పనిచేసే వారంటే చిన్న చూపు చూస్తారు. వారి సంపాదన కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ప్రపంచంలో ఏ వృత్తీ తక్కువ కాదు. ఆ మాటకొస్తే ఐటీ, ఇతర ఉద్యోగాల కంటే పని మనుషులకే ఎక్కువ డిమాండ్‌. దుబాయ్‌లో పనిమనుషుల కోసం ఇచ్చిన ఉద్యోగ ప్రకటనే ఇందుకు నిదర్శనం. జీతం ఎంతనుకున్నారు? ఏకంగా నెలకు రూ.7 లక్షలు.

దుబాయ్ కు చెందిన ఓ స్టాఫింగ్ ఏజెన్సీ రెండు హౌస్ మేనేజర్ (పని మనిషి) ఉద్యోగాల కోసం ఇచ్చిన నియామక ప్రకటన ఇంటర్నెట్ ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఉద్యోగానికి నెలకు 30,000 ఈఏఈ దిరమ్‌లు అంటే భారతీయ కరెన్సీలో రూ.7 లక్షలు ఇస్తామని అందులో ప్రకటించారు. దీన్ని సంవత్సరానికి లెక్కేస్తే దాదాపు రూ.83 లక్షలు. భారత్‌లో చాలా మంది ఐటీ, టెక్‌, ఫైనాన్స్‌ నిపుణులకు కూడా ఇంత జీతం లేదు. చెప్పాలంటే ఇది దుబాయ్‌లో కూడా ఎక్కువ జీతమే. దీంతో కొందరు సోషల్ మీడియా యూజర్లు ఈ పనిమనిషి కొలువు కోసంతమ ప్రస్తుత ఉద్యోగాలను వదులుకుంటామంటూ జోక్ చేస్తున్నారు.

మిడిల్ ఈస్ట్ లోని సంపన్న, రాజకుటుంబాల ఇళ్లలో పనిచేసేందుకు నైపుణ్యమున్న పనివారిని సమకూర్చే రిక్రూట్ మెంట్ ఏజెన్సీ రాయల్ మైసన్ ఇటీవల అబుదాబి, దుబాయ్ లలో వీఐపీ క్లయింట్ల ఇళ్లలో పని చేసేందుకు ఇద్దరు పనిమనుషులు కావాలంటూ ఈ ప్రకటన ఇచ్చింది. "మేము ప్రస్తుతం మా ప్రతిష్ఠాత్మక జట్టులో చేరడానికి నైపుణ్యం, అంకితభావం కలిగిన ఫుల్ టైమ్ హౌస్ మేనేజర్‌ను వెతుకుతున్నాము. ఈ ఉద్యగానికి నెలకు 30,000 దిరమ్‌ల ఆకర్షణీయమైన వేతనం ఉంటుంది" అని రాయల్ మైసన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది.

ఎంపికైన అభ్యర్థులు లగ్జరీ ఇళ్లలో రోజువారీ పనులు చూసుకోవాల్సి ఉంటుంది. ఇతర పనివాళ్లను పర్యవేక్షించడంతోపాటు ఇంటి ఖర్చుల నిర్వహణ బాధ్యతలు కూడా ఉంటాయని జాబ్ లిస్టింగ్ పేర్కొంది. అయితే ఈ పనిమనిషి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారికి ఇంతకు ముందు లగ్జరీ ఇళ్లలో పనిచేసిన అనుభవం ఉండాలి.

Advertisement
 
Advertisement
Advertisement