వివేక్‌ ఒబెరాయ్ రియల్ ఎస్టేట్ కంపెనీ దూకుడు | Vivek Oberoi Dubai realty firm BNW Targeting Indian Buyers 10000 UAE Homes | Sakshi
Sakshi News home page

వివేక్‌ ఒబెరాయ్ రియల్ ఎస్టేట్ కంపెనీ దూకుడు

Aug 6 2026 5:08 PM | Updated on Aug 6 2026 5:19 PM

Vivek Oberoi Dubai realty firm BNW Targeting Indian Buyers 10000 UAE Homes

యూఏఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ బీఎన్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్స్‌ (BNW Developments) భారత మార్కెట్‌పై మరింత దృష్టి సారిస్తోంది. దుబాయ్, రాస్ అల్ ఖైమా (RAK)లో చేపడుతున్న ప్రాజెక్టులకు భారతీయ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా తన ఛానల్ పార్టనర్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు, బ్రోకర్లతో భాగస్వామ్యాలను పెంచుకుంటోంది. వచ్చే నాలుగేళ్లలో యూఏఈలో సుమారు 10,000 ఇళ్లను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది.

బీఎన్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్స్‌‌ను అంకుర్ అగర్వాల్ స్థాపించగా, నటుడు-పారిశ్రామికవేత్త వివేక్ ఆనంద్ ఒబెరాయ్ మేనేజింగ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు. సంస్థ వివరాల ప్రకారం, బీఎన్‌డబ్ల్యూ ప్రస్తుతం దుబాయ్, రాస్ అల్ ఖైమాలో బ్రాండెడ్ రెసిడెన్సులు, హాస్పిటాలిటీ ఆధారిత ప్రాజెక్టులు, మిక్స్‌డ్-యూజ్ డెవలప్‌మెంట్లు, మాస్టర్-ప్లాన్డ్ కమ్యూనిటీలపై పనిచేస్తోంది. సంస్థ మొత్తం గ్రాస్ డెవలప్‌మెంట్ విలువ (GDV) సుమారు 32 బిలియన్‌ దిర్హమ్‌లుగా (రూ.72 వేల కోట్లే) పేర్కొంది.

భారతీయ కొనుగోలుదారులే టార్గెట్

అధిక అద్దె ఆదాయం, దీర్ఘకాలిక ఆస్తి విలువ పెరుగుదల, అంతర్జాతీయ కనెక్టివిటీ వంటి అంశాల కారణంగా సంపన్న భారతీయులు యూఏఈ ప్రాపర్టీ మార్కెట్‌పై ఆసక్తి చూపుతున్నారని బీఎన్‌డబ్ల్యూ చెబుతోంది. సంస్థ తాజా ప్రకటన ప్రకారం, 2026 తొలి అర్ధభాగంలో భారతీయ కొనుగోలుదారులు తమ మొత్తం వ్యాపారంలో 14.38 శాతం వాటాను కలిగి ఉన్నారు.

దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్‌లో భారతీయుల ప్రాధాన్యం ఇతర తాజా డేటాలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. జూలై 2026లో వెలువడిన ఫామ్ ప్రాపర్టీస్ డేటా ప్రకారం, అంతర్జాతీయ ఆన్‌లైన్ ప్రాపర్టీ సెర్చ్‌లలో భారత్ వాటా 20.59 శాతంగా ఉంది. అలాగే డీఎక్స్‌బీ ఇంటరాక్ట్‌ డేటాను ఉటంకిస్తూ, 2026 తొలి భాగంలో దుబాయ్‌లో విదేశీ కొనుగోలుదారుల్లో భారతీయులు అతిపెద్ద వర్గంగా కొనసాగుతున్నారని నివేదికలు పేర్కొన్నాయి.

మార్కెట్ మందగించినా.. పెట్టుబడులపై ఆసక్తి

మధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కార్యకలాపాలు కొంత మందగించాయి. కావెండిష్‌ మ్యాక్స్‌వెల్‌ గణాంకాల ప్రకారం, 2026 జనవరి–మే మధ్య దుబాయ్‌లో 66,900 రెసిడెన్షియల్ లావాదేవీలు నమోదయ్యాయి. వీటిలో సుమారు 74 శాతం ఆఫ్-ప్లాన్ కొనుగోళ్లే. అయితే మే నెలలో లావాదేవీలు 9,500కు తగ్గాయి. గత ఏడాది మేలో నమోదైన 17,600తో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల. తొలి ఐదు నెలల్లో మొత్తం లావాదేవీల విలువ 196.2 బిలియన్‌ దిర్హమ్‌లకు పైగా ఉండగా, గత ఏడాది ఇదే కాలంలో అది 217.8 బిలియన్‌ దిర్హమ్‌లుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారతీయ పెట్టుబడిదారులపై బీఎన్‌డబ్ల్యూ నమ్మకం ఉంచుతోంది. దుబాయ్‌లో మార్కెట్ వేగం కొంత తగ్గినప్పటికీ, భారతీయ కొనుగోలుదారుల నుంచి దీర్ఘకాలిక పెట్టుబడి డిమాండ్ కొనసాగుతోందని సంస్థ భావిస్తోంది.

2,000 మందికి పైగా భాగస్వాములతో సమావేశం

భారత మార్కెట్లో తన పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు బీఎన్‌డబ్ల్యూ ఇటీవల ఢిల్లీ-NCRలో గ్లోబల్ పార్ట్‌నర్స్ మీట్ నిర్వహించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 2,000 మందికి పైగా ఛానల్ భాగస్వాములు, రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు సంస్థ తెలిపింది. బీఎన్‌డబ్ల్యూ వ్యవస్థాపకుడు, చైర్మన్ అంకుర్ అగర్వాల్ మాట్లాడుతూ, భారత్ తమకు కేవలం కీలకమైన మూల మార్కెట్ మాత్రమే కాదని, సంస్థ భవిష్యత్ వృద్ధిలో వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement