విమానయాన రంగంలో ఈ ఏడాదీ జోష్‌..!  | Domestic air travel in India to grow 7–10percent in FY 2026 | Sakshi
Sakshi News home page

విమానయాన రంగంలో ఈ ఏడాదీ జోష్‌..! 

Jun 22 2025 6:08 AM | Updated on Jun 22 2025 6:08 AM

Domestic air travel in India to grow 7–10percent in FY 2026

2025–26లో పయ్రాణికుల్లో 7–10 శాతం వృద్ధి  

అయినా నష్టాల్లోనే ఏవియేషన్‌ సెక్టార్‌ 

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణికుల రద్దీ (ఎయిర్‌ ట్రాఫిక్‌) 7–10 శాతం మేర పెరగొచ్చని రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనా వేసింది. 17.5–18.1 కోట్ల మంది ప్రయాణించొచ్చని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25)లో 7.6 శాతం అధికంగా 16.54 కోట్ల మంది ప్రయాణించడం గమనార్హం. 2019–20 సంవత్సరంలో నమోదైన విమాన ప్రయాణికుల రద్దీతో పోల్చితే ఇది 16.8 శాతం వృద్ధికి సమానమని పేర్కొంది. ప్రయాణికుల రద్దీ పెరిగినప్పటికీ విమానయాన రంగం రూ.2,000 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు నికర నష్టాలను మూటగట్టుకోవచ్చని అంచనా వేసింది. 

2024–25లో ఈ రంగం నమోదు చేసిన నష్టాల స్థాయిలోనే ఈ ఏడాదీ ఉండొచ్చని.. 2023–24లో రూ.1,600 కోట్ల నికర లాభాలతో పోల్చి చూస్తే పూర్తి వైరుధ్యమని వివరించింది. అధిక ఇంధన ధరలు, పెరుగుతున్న వ్యయాలు, నూతన ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సంబంధించి లీజు వ్యయాల పెరుగుదల వంటి పరిణామాలను నష్టాలకు కారణాలుగా తెలిపింది. పరిశ్రమ వడ్డీ చెల్లింపుల నిష్పత్తి (ఇంటరెస్ట్‌ కవరేజీ) 1.5–2 శాతం స్థాయిలో ఉంటుందని పేర్కొంది. ఎన్నో సవాళ్ల మధ్య ఆర్థిక స్థిరత్వంలో మెరుగుదల కనిపిస్తున్నట్టు వివరించింది.

మే నెలలో ప్రయాణాల జోరు 
మే నెలలో 1.43 కోట్ల మంది ప్రయాణికులు విమానయాన సేవలను వినియోగించుకున్నారు. 2024 మే నెల డేటాతో పోల్చి చూస్తే ఇది 4 % అధికమని ఇక్రా నివేదిక తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలతో పోల్చి చూసినప్పుడు వృద్ధి ఫ్లాట్‌గా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌–మే నెలల్లో కలిపి 2.86 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. గత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల కంటే 6.2% ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ప్రయాణికుల్లో వృద్ధి 7–10% మేర, అంతర్జాతీయ ప్రయాణికుల్లో వృద్ధి 15–20% మేర నమోదవుతుందని ఇక్రా అంచనా వేసింది. వ్యయాలు పెరిగిపోయిన నేపథ్యంలో మెరుగైన  పీఎల్‌ఎఫ్‌పై ఎయిర్‌లైన్స్‌ దృష్టి పెట్టాల్సి ఉంటుందని 
పేర్కొంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement