ఫ్లైట్స్ ఫుల్లయినా ప్రాఫిట్ అంతంతే
క్యూ3లో రూ. 549 కోట్లకు పరిమితం
విమాన సర్వీసుల్లో అంతరాయాల ఎఫెక్ట్
కొత్త కార్మిక చట్టాల అమలు ప్రభావం కూడా
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 78 శాతం పడిపోయి రూ. 549 కోట్లకు పరిమితమైంది. విమాన సర్వీసుల అంతరాయాలకుతోడు కొత్త కార్మిక చట్టాల అమలు లాభాలను దెబ్బతీశాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 2,449 కోట్లు ఆర్జించింది.
విమాన సర్విసుల్లో అవాంతరాల కారణంగా రూ. 577 కోట్లు, కొత్త కారి్మక చట్టాల అమలుతో రూ. 969 కోట్లు చొప్పున వ్యయాలు నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. వెరసి దాదాపు రూ. 1,547 కోట్లమేర కేటాయింపులు చేపట్టినట్లు వెల్లడించింది. సర్విసుల్లో అంతరాయాలపై రూ. 22 కోట్లకుపైగా జరిమానాకు సైతం గురైనట్లు తెలియజేసింది.
ఆదాయం అప్
తాజా సమీక్షా కాలంలో ఇండిగో బ్రాండ్ విమాన సర్విసుల కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం రూ. 22,993 కోట్ల నుంచి రూ. 24,541 కోట్లకు ఎగసింది. డిసెంబర్ 3–5 కాలంలో పలు సర్విసులు నిలిచిపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నట్లు కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలియజేశారు. ఈ కాలంలో 2,507 సర్విసులు రద్దుకాగా.. మరో 1,852 సర్విసులు ఆలస్యమయ్యాయి.
ఇలాంటి నిర్వహణ సంబంధ సవాళ్లలోనూ ఇండిగో పటిష్ట ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. కాగా.. 2026 ఫిబ్రవరి 10 తదుపరి సర్విసుల రద్దు ఉండబోదని ఇండిగో హామీఇచి్చనట్లు ఒక ప్రకటనలో డీజీసీఏ పేర్కొనడం గమనార్హం. 2025 డిసెంబర్ 31 కల్లా కంపెనీ నగదు నిల్వలు రూ. 51,607 కోట్లకు చేరగా.. లీజ్ చెల్లింపులతో కలిపి మొత్తం రుణ భారం రూ. 76,858 కోట్లుగా నమోదైంది.
ఫలితాల నేపథ్యంలో ఇండిగో షేరు బీఎస్‌ఈలో 1.2 శాతం లాభంతో రూ. 4,914 వద్ద ముగిసింది.


