తక్కువ శబ్దంతో దూసుకెళ్లే ‘ఎక్స్–59’ విమానం అభివృద్ధి
విమానయాన రంగంలో నూతన శకంలోకి అడుగుపెట్టిన నాసా
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’అరుదైన ఘనత సృష్టించింది. విమానయాన రంగంలో ఒక నూతన శకంలోకి అడుగుపెట్టింది. తక్కువ శబ్దంతో వేగంగా దూసుకెళ్లే మొట్టమొదటి సూపర్‌సానిక్ విమానం ‘ఎక్స్–59’ని అభివృద్ధి చేసింది. జూన్ 5న జరిగిన ప్రయోగంలో ఈ విమానం తొలిసారిగా ధ్వని అవరోధాన్ని విజయవంతంగా అధిగమించింది.
భవిష్యత్తులో విమాన ప్రయాణాల్లో ఒక చరిత్రాత్మక మార్పునకు నాంది పలికింది. సాంప్రదాయ సూపర్‌సానిక్ విమానాలు చెవులు చిల్లులు పడే భారీ శబ్దంతో దూసుకెళ్తాయి. దీనికి ప్రత్యామ్నాయంగా సున్నితమైన శబ్దంతో ప్రయాణించే విమానాన్ని తయారు చేయడానికి నాసా ‘క్వెస్ట్ మిషన్’కు శ్రీకారం చుట్టింది. విమానయానంలో ఇదొక గొప్ప ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
30 అడుగుల ముందు భాగం.. పైభాగంలో ఇంజిన్
గాలిలో ఒక వస్తువు నెమ్మదిగా కదులుతూ ఉంటే.. ఆ మార్గంలో దానికి ఎదురయ్యే గాలి అణువులకు పక్కకు తప్పుకోవడానికి తగిన సమయం ఉంటుంది. అందుకే తక్కువ ధ్వని వెలువడుతుంది. ధ్వని వేగంతో దూసుకెళ్లే సూపర్‌సానిక్ విమానం విషయంలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే దాని మార్గంలో అడ్డొచ్చే గాలి అణువులకు పక్కకు తప్పించుకోవడానికి తగినంత సమయం ఉండదు. అవి ఒకదానిపై ఒకటి పేరుకుపోతాయి.
ఇది అధిక పీడనాన్ని సృష్టిస్తుంది. శక్తివంతమైన షాక్‌వేవ్ కారణంగా భరించలేని శబ్దం వెలువడుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి నాసా ఇంజనీర్లు సూపర్‌సానిక్ ఫ్లైట్ డిజైన్‌ను మార్చారు. ఎక్స్–59 విమానాన్ని పొడవైన ఆకారంతో రూపొందించారు. దీని ముందు భాగం ముక్కు ఆకారంలో దాదాపు 30 అడుగుల పొడవు ఉంటుంది.
ఈ ప్రత్యేకమైన నిర్మాణం గాలి పీడన తరంగాలు ఒకదానితో ఒకటి కలిసిపోకుండా నిరోధిస్తుంది. విమానం గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు భారీ ప్రకంపనకు బదులుగా విడివిడిగా ఉండే చిన్న, బలహీనమైన తరంగాల శ్రేణిని సృష్టిస్తుంది. అది ఒక మృదువైన ధ్వనిలా వినిపిస్తుంది. ఇంట్లో గాలికి కిటికీ కొట్టుకున్న శబ్దం లాంటిది వినొచ్చు. అంతేకాకుండా ఎక్స్–59లోని ఇంజిన్‌ను విమానం పైభాగంలో అమర్చారు.
ఇది శబ్దాన్ని నేలపై మనుషుల నుంచి దూరంగా మళ్లిస్తుంది. ఈ పరిశోధన సత్ఫలితాలు ఇవ్వడంతో రాబోయే రోజుల్లో విమానాన్ని మాక్ 1.4 వేగానికి.. అంటే గంటకు సుమారు 925 మైళ్ల (1,488 కిలోమీటర్ల) వేగానికి చేర్చడానికి నాసా సైంటిస్టుల బృందం సిద్ధమవుతోంది. వేగం, నిశ్శబ్దం రెండూ కలిసి ఉండే ప్రపంచానికి మనల్ని దగ్గర చేయడానికి కృషి చేస్తోంది.
గంటకు 713 మైళ్ల వేగం
ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే విమానాన్ని సూపర్‌సానిక్ ఫ్లైట్ అంటారు. వీటి నుంచి వెలువడే భారీ శబ్దమే ఈ విమానాలకు ప్రతికూలంగా మారింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వీటిపై నిషేధం విధించాయి. తమ గగనతలంపై ఇలాంటి విమానాల ప్రయాణానికి అనుమతి ఇవ్వడం లేదు. ఒక విమానం ధ్వని తరంగాల వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినప్పుడు.. అది ఒక పీడన తరంగాన్ని సృష్టిస్తుంది. అది ఉరుములాగా నేలను ఢీకొంటుంది. ఈ పరిస్థితిని మార్చడానికే ఎక్స్–59ని రూపొందించారు.
పెద్ద శబ్దానికి బదులుగా, దూరంగా కారు తలుపు మూసుకునే శబ్దం కంటే తక్కువ శబ్దంతో కూడిన మృదువైన చప్పుడును సృష్టించడమే ఈ విమానం లక్ష్యం. కాలిఫోరి్నయాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఈ విమానాన్ని పరీక్షించారు. ఇది ‘మాక్ 1.1’గరిష్ట వేగాన్ని అందుకుంది. ధ్వని వేగం కంటే 1.1 రెట్ల వేగంతో ప్రయాణించడాన్ని మాక్ 1.1 అంటారు. అంటే గంటకు 713 మైళ్లు(1,147 కిలోమీటర్లు) అని చెప్పుకోవచ్చు. ఈ వేగాన్ని విజయవంతంగా అందుకోవడం ద్వారా ఎక్స్–59 విమానం ఉద్దేశించిన విధంగానే పనిచేస్తోందని తేలింది. అయితే శబ్దం మాత్రం ఎక్కువగా వెలువడలేదు. ఇందులోని రహస్యం అంతా విమానం డిజైన్‌లోనే ఉంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


