
నిబంధనలను విరుద్ధంగా రిజిస్టర్ అయిన వేలాది డ్రోన్లు, వాటి కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు భారత విమానయాన భద్రతా నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) డ్రోన్ రిజిస్ట్రేషన్లపై విస్తృత సమీక్ష చేపట్టింది. దిగుమతి నిషేధాలు, తప్పనిసరి నిబంధనలను పాటించకుండా చాలా డ్రోన్లు రిజిస్టర్ అయ్యాయని నివేదికలు వెల్లడైన నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ప్రధానంగా చైనా సంస్థలకు చెందిన డ్రోన్లు దేశీయంగా తప్పుడు కారణాలతో నమోదయ్యాయనే వాదనలున్నట్లు తెలిపింది.
2021 నుంచి దిగుమతిలపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ 8,700కి పైగా చైనా డ్రోన్లు భారతదేశంలో నమోదయ్యాయని జులై 29న ఓ వార్తా సంస్థ కోరిక మేరకు ఇచ్చిన నివేదికలో తెలిపారు. డ్రోన్ అనుమతులు పొందడానికి తప్పుడు డిక్లరేషన్లను ఉపయోగించే సంస్థలు అధికారిక రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌లైన డిజిటల్ స్కై, ఈ-జీసీఏలను దుర్వినియోగం చేస్తున్నాయని డీజీసీఏ ఇటీవల జారీ చేసిన నోటీసులో పేర్కొంది. కొంతమంది ఆపరేటర్లు తప్పుడు కేటగిరీల కింద యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లను (యూఐఎన్) జనరేట్ చేసేటప్పుడు సర్టిఫికేషన్ ప్రక్రియను దాటవేయడంతో తీవ్రమైన ఉల్లంఘనలు జరుగుతున్నట్లు నోటీసు ఎత్తిచూపింది.
ముఖ్యంగా చాలా మంది దరఖాస్తుదారులు కఠినమైన కమర్షియల్ నిబంధనలను పాటించకుండా ఉండడానికి తమ డ్రోన్లను ‘మోడల్ ఆర్‌పీఏఎస్’ సబ్‌కేటగిరీ కింద తప్పుగా వర్గీకరించారు. ఇవి విద్య, పరిశోధన, పరీక్ష లేదా వినోద ఉపయోగం కోసం ఉద్దేశించినవి. కానీ వాటిని ఇతర అవసరాల కోసం వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది నిబంధనల ఉల్లంఘనేనని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి దుర్వినియోగం పౌర విమానయాన వ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడమే కాకుండా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని అంటున్నారు.
ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్‌లతో స్వావలంబన
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నుంచి అవసరమైన దిగుమతి అనుమతులు లేకుండానే పలు డ్రోన్లను విదేశాల్లో తయారు చేసి భారత్‌లోకి తీసుకువచ్చినట్లు డీజీసీఏ వెల్లడించింది. 2022 డీజీఎఫ్‌టీ నోటిఫికేషన్ ప్రకారం రక్షణ, పరిశోధన, అభివృద్ధి, భద్రతకు సంబంధించిన ప్రయోజనాలు మినహా డ్రోన్ల దిగుమతులు నిషిద్ధం. కొనుగోలు ఇన్‌వాయిస్‌లు, దిగుమతి అనుమతులు, డ్రోన్ ఛాయాచిత్రాలు వంటి మద్దతు పత్రాలతో పాటు లిఖితపూర్వక వివరణ ఇవ్వడానికి బాధిత డ్రోన్ కంపెనీలకు ఏవియేషన్ రెగ్యులేటర్ సెప్టెంబర్ 12 వరకు గడువు ఇచ్చింది. రిజిస్ట్రేషన్‌ను సమర్థించడంలో విఫలమైతే యూఐఎన్‌లను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. వాటితోపాటు చట్టపరమైన చర్యలు ఉంటాయి.