రూ.86 కోట్ల బైబ్యాక్‌ పూర్తి చేసిన సాస్‌ యూనికార్న్‌ | Darwinbox wrapped up third ESOP buyback | Sakshi
Sakshi News home page

రూ.86 కోట్ల బైబ్యాక్‌ పూర్తి చేసిన సాస్‌ యూనికార్న్‌

Jun 25 2025 8:48 AM | Updated on Jun 25 2025 8:50 AM

Darwinbox wrapped up third ESOP buyback

సాఫ్ట్‌వేర్‌-యాస్‌-ఏ-సర్వీస్ (సాస్) యూనికార్న్ డార్విన్‌బాక్స్‌ రూ.86 కోట్ల ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్‌ ప్లాన్ (ఈసాప్‌) బైబ్యాక్‌ను పూర్తి చేసినట్లు తెలిపింది. భారత్, ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియా, మిడిల్‌ఈస్ట్‌లో సర్వీసులు అందిస్తున్న ఈ కంపెనీకి చెందిన 11 కార్యాలయాల్లోని 350 మందికి పైగా ఉద్యోగులు ఈ బైబ్యాక్ ద్వారా లబ్ధి పొందినట్లు కంపెనీ పేర్కొంది. తాజాగా సమకూర్చుకున్న రూ.86 కోట్ల బైబ్యాక్‌ గడిచిన నాలుగేళ్ల కాలంలో మూడోది కావడం గమనార్హం.

ఈ సందర్భంగా డార్విన్‌బాక్స్‌ సహ వ్యవస్థాపకులు చైతన్య పెద్ది మాట్లాడుతూ..‘డార్విన్‌బాక్స్‌లో ప్రతిభ కలిగిన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. కంపెనీతోపాటు వారూ ఎదిగేలా చూడటం మా ఉద్దేశం. సంపద సృష్టిలోనూ సంస్థతోపాటు ఉద్యోగులు ఎదిగేందుకు చర్యలు చేపడుతున్నాం. కంపెనీ మెరుగైన పనితీరుతో మంచి భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడటానికి పరిశ్రమకు చెందిన కొంతమంది మేధావులు మాతో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో దూసుకుపోయేందుకు కంపెనీ ఆర్ అండ్ డీ సామర్థ్యాలను రెట్టింపు చేస్తోంది. ఈ ప్రయాణంలో మరికొందరు ప్రతిభావంతులను ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు. మార్చి 2025లో కంపెనీ తన సాంకేతికతను బలోపేతం చేయడానికి, అంతర్జాతీయంగా విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేయడానికి పార్ట్నర్స్ గ్రూప్, కేకేఆర్‌ నుంచి  నిధులు సేకరించింది. ఆ నిధుల సేకరణలో భాగంగా 140 మిలియన్ డాలర్ల(సుమారు రూ.120 కోట్లు)ను సమకూర్చుకుంది.

కంపెనీ ఎంసీపీ (మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్) సర్వర్‌తో సహా బహుళ ఏఐ ఉత్పత్తులను ప్రారంభించినట్లు తెలిపింది. ఇది ఏదైనా అనుకూలమైన ఏఐ ఏజెంట్‌కు సదరు ప్లాట్‌ఫామ్‌లో హెచ్‌ఆర్‌ డేటా, వర్క్ ఫ్లోలతో సురక్షితంగా సంభాషించడానికి వీలు కల్పిస్తుంది. ‘డార్విన్ బాక్స్ సెన్స్’ అనే జెనరేటివ్‌ ఏఐ ఇంజిన్‌ను కూడా విడుదల చేసినట్లు చెప్పింది. ఇది 40 ఎంబెడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను అందిస్తుంది. గత ఏడాదిలో 10 ప్రాంతాల్లో మల్టీ కంట్రీ పేరోల్ సొల్యూషన్స్‌ను అందించినట్లు పేర్కొంది. 

‘కంపెనీ విలువను పెంచేవారికి తగిన భాగస్వామ్యం ఉండాలని సంస్థ విశ్వసిస్తోంది. నూతన ఆవిష్కరణలు, అంతర్జాతీయ స్థాయిలో వృద్ధిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నా అందుకు సమానంగా ఉద్యోగులకూ అర్థవంతమైన ఫలాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం. ఉద్యోగులు సంస్థను తమదిగా భావించే సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం’ అని డార్విన్‌ బాక్స్‌ సహ వ్యవస్థాపకుడు జయంత్‌ పాలేటి అన్నారు.

ఇదీ చదవండి: మీపేరుపై ఇంకేమైనా సిమ్‌కార్డులున్నాయా?

2015లో స్థాపించబడిన పీక్ ఎక్స్‌వీ, లైట్‌స్పీడ్‌ వంటి కంపెనీల నియామకాలు, ఆన్‌బోర్డింగ్‌, ఉద్యోగుల హాజరు నిర్వహణతో సహా వారి హెచ్ఆర్ అవసరాలను నిర్వహించడానికి సహాయపడుతుంది. స్టార్ బక్స్, మెక్ డొనాల్డ్స్, ఆక్సా, సిగ్నా, వీవర్క్, ఎయిర్ టెల్, వేదాంత వంటి బ్రాండ్లతో సహా 1,000 సంస్థలకు ఇది సేవలు అందిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement