ఇన్ఫీ బైబ్యాక్‌లో ప్రమోటర్లు నో  | Infosys Founders Nandan Nilekani, Sudha Murty Opt Out Of Rs 18,000-Crore Buyback | Sakshi
Sakshi News home page

ఇన్ఫీ బైబ్యాక్‌లో ప్రమోటర్లు నో 

Oct 23 2025 1:39 AM | Updated on Oct 23 2025 1:39 AM

Infosys Founders Nandan Nilekani, Sudha Murty Opt Out Of Rs 18,000-Crore Buyback

పాల్గొనబోమన్న నందన్‌ నిలేకని, సుధామూర్తి 

ప్రస్తుతం ప్రమోటర్ల వాటా 13.05% 

షేరుకి 1,800 ధరలో కొనుగోలు 

బైబ్యాక్‌ కోసం రూ. 18,000 కోట్లు కేటాయింపు 

న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ చేపట్టనున్న సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు (బైబ్యాక్‌)లో పాలుపంచుకోమంటూ ప్రమోటర్లు పేర్కొన్నారు. ప్రమోటర్‌ గ్రూప్‌ సభ్యులు నందన్‌ ఎం.నిలేకని, సుధా మూర్తి తదితరులు ఈ అంశాన్ని లేఖల ద్వారా తెలియజేసినట్లు ఇన్ఫోసిస్‌ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 13.05 శాతంగా నమోదైంది. 

కంపెనీ సహవ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి భార్య సుధా మూర్తి, కుమార్తె అక్షత, కుమారుడు రోహన్‌తోపాటు.. కంపెనీ సహవ్యవస్థాపకుడు నందన్‌ నిలేకని, ఆయన భార్య రోహిణి, వారి సంతానం నిహార్, జాహ్నవి ప్రమోటర్లలో ఉన్నారు. అంతేకాకుండా ఇతర సహవ్యవస్థాపకులు, వారి కుటుంబ సభ్యులు సైతం ప్రమోటర్లుగా ఇన్ఫోసిస్‌లో వాటా కలిగి ఉన్నారు.  

మంగళవారం మూరత్‌ ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్‌ షేరు బీఎస్‌ఈలో 0.7 శాతం బలపడి రూ. 1,472 వద్ద ముగిసింది.  

బైబ్యాక్‌ ఇలా.. 
గత నెల 11న ఇన్ఫోసిస్‌ బోర్డు షేరుకి రూ. 1,800 ధర మించకుండా 2.41 శాతం వాటా బైబ్యాక్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 18,000 కోట్లు వెచ్చించనుంది. వెరసి రూ. 5 ముఖ విలువగల 10 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. ఇన్ఫోసిస్‌ 2025 జూన్‌ త్రైమాసికంలో 88.4 కోట్ల డాలర్ల(రూ. 7,805 కోట్లు) ఫ్రీ క్యాష్‌ ఫ్లోను ప్రకటించింది. 

సమీపకాలంలో వ్యూహాత్మక, నిర్వహణ సంబంధ నగదు అవసరాలను పరిగణించాక మిగులు నిధులను వాటాదారులకు పంచాలన్న కంపెనీ విధానాల్లో భాగంగా తాజా బైబ్యాక్‌కు తెరతీస్తున్నట్లు వివరించింది. కాగా.. కంపెనీ తొలిసారి 2017లో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టింది. ఈక్విటీలో 4.92 శాతం వాటాకు సమానమైన 11.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. ఇందుకు ఒక్కో షేరుకి రూ. 1,150 ధరలో రూ. 13,000 కోట్లు వెచ్చించింది. ఆపై రెండోసారి 2019లో రూ. 8,260 కోట్లు, మూడోసారి 9,200 కోట్లు చొప్పున షేర్ల బైబ్యాక్‌కు వినియోగించింది. ఈ బాటలో 2022లోనూ రూ. 9,300 కోట్లతో ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా రూ. 1,850 ధర మించకుండా బైబ్యాక్‌ చేపట్టింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement