
షేరుకు రూ. 1,800 ధర ఖరారు
బోర్డు సమావేశంలో ఆమోదం
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి అంగీకరించింది. గురువారం (11న) సమావేశమైన బోర్డు షేరుకి రూ. 1,800 ధర మించకుండా 2.41 శాతం వాటా బైబ్యాక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 18,000 కోట్లు వెచ్చించనుంది. వెరసి రూ. 5 ముఖ విలువగల 10 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. గురువారం బీఎస్‌ఈలో ముగింపు ధర రూ. 1,510తో పోలిస్తే బైబ్యాక్‌కు 19 శాతం ప్రీమియంను నిర్ణయించింది.
కంపెనీ 2025 జూన్ త్రైమాసికంలో 88.4 కోట్ల డాలర్ల (రూ. 7,805 కోట్లు) ఫ్రీ క్యాష్ ఫ్లోను ప్రకటించింది. కాగా.. కంపెనీ తొలిసారి 2017లో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టింది. ఈక్విటీలో 4.92 శాతం వాటాకు సమానమైన 11.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. ఇందుకు ఒక్కో షేరుకి రూ. 1,150 ధరలో రూ. 13,000 కోట్లు వెచ్చించింది. ఆపై రెండోసారి 2019లో రూ. 8,260 కోట్లు, మూడోసారి 2021లో 9,200 కోట్లు చొప్పున షేర్ల బైబ్యాక్‌కు వినియోగించింది. ఈ బాటలో 2022లోనూ రూ. 9,300 కోట్లతో ఓపెన్ మార్కెట్ ద్వారా రూ. 1,850 ధర మించకుండా బైబ్యాక్ చేపట్టింది.
ఇన్ఫోసిస్ షేరు 1.5% క్షీణించి రూ. 1,510 వద్ద ముగిసింది.