Sakshi News home page

Infosys Sudha Murty: రాజ్య సుధ

Published Sat, Mar 9 2024 12:49 AM

Infosys Sudha Murty nominated to Rajya Sabha by President Droupadi Murmu - Sakshi

సాటి మనుషుల కోసం పని చేయడం
సామాజిక సేవ ద్వారా పరిస్థితులను మెరుగుపరచడం
యువతకు స్ఫూర్తిగా నిలవడం..
రచయితగా ఎదగడం
ఇన్ఫోసిస్‌ దిగ్గజంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం
సుధామూర్తిని నేడు రాజ్యసభకు చేర్చాయి.

ఉమెన్స్‌ డే రోజు ఆమెను రాష్ట్రపతి ముర్ము రాజ్యసభకు నామినేట్‌ చేశారు. సుధామూర్తి జీవన విశేషాలు.


► తొలి పాఠాలు
సుధామూర్తి బాల్యం హుబ్లీలో గడిచింది. తండ్రి కులకర్ణి డాక్టర్‌. ఆయన రోజూ టీ సేవించేవాడు. ఒకరోజు పాలు రాలేదు. తండ్రి టీ తాగక వేరే ఏ పనీ మొదలుపెట్టలేక కూచుని ఉన్నాడు. ‘ఏంటి నాన్నా?’ అని అడిగింది సుధామూర్తి. ‘ఉదయాన్నే టీకి నేను అలవాటు పడ్డానమ్మా. ఇవాళ టీ తాగక తలనొప్పి వచ్చింది. నువ్వు మాత్రం దేనికీ అతిగా అలవాటు పడకు.. కాఫీ, టీలకైనా సరే’ అన్నాడు. సుధామూర్తి ఆ పాఠాన్ని గుర్తు పెట్టుకుంది.

ఇవాళ ఆమెకు డెబ్బై నాలుగు ఏళ్లు. నేటికీ ఉదయాన్నే లేచి టీగానీ కాఫీ గాని తాగి ఎరగదు. సుధామూర్తి హుబ్లీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే షిగావ్‌లో పుట్టింది. అక్కడ ఆమె అమ్మమ్మ, తాతయ్య ఉండేవారు. తాతయ్య స్కూల్‌ టీచర్‌. ఆయన తనకంటే వయసులో ఎంత చిన్నవారినైనా ‘మీరు’ అని బహువచనం వాడేవారు. ‘నీ కంటే చిన్న కదా తాతయ్య’ అని సుధామూర్తి అంటే ‘లోపలి ఆత్మ పెద్దదే కదమ్మా’ అనేవారు. ఎదుటివారిని గౌరవించడం అలా నేర్చుకుందామె. తాతయ్య ఆమెకు మూడు జీవన పాఠాలు నేర్పారు.

1.సింపుల్‌గా జీవించు 2.జ్ఞానాన్ని సముపార్జిస్తూనే ఉండు 3. పుస్తకాలు చదువు. ఇవి సుధామూర్తి నేటికీ పాటిస్తూనే ఉంది. అమ్మమ్మ ‘ఆకలితో ఉన్నవారిని గమనించు’ అని చెప్పింది. వాళ్ల ఇంటికి రోజూ ఒక భిక్షకుడు వస్తే ఇంట్లో మంచి బియ్యం నిండుకుని ముతకబియ్యం ఉన్నా అమ్మమ్మ మంచి బియ్యమే భిక్షకుడికి వేసేది. ‘ముతక బియ్యం మనం తినొచ్చులే’ అనేది. ఇదీ సుధామూర్తికి తొలి పాఠమే.

ఇక అమ్మ విమల నేర్పిన పాఠం– ‘ఎంతో అవసరమైతే తప్ప డబ్బు ఖర్చు పెట్టకు’ అని. అంతే కాదు నీకు బాల్యంలో మంచి అలవాట్లు ఉంటే అవే కాపాడతాయి అని కూడా ఆమె అనేది. ఉదయాన్నే లేచి కాగితం మీద 10 సార్లు ‘దేవుడికి నమస్కారం’ అని రాయించేదామె. నేటికీ సుధా మూర్తి ఆ అలవాటును మానలేదు. ఇక స్కూల్‌ టీచరు రాఘవేంద్రయ్య... ‘నీకు లెక్కలు భలే వస్తున్నాయి. లెక్కల్ని వదలకు. పైకొస్తావ్‌‘ అన్నాడు. ఆమె ఆనాటి నుంచి లెక్కల్నే రెక్కలుగా చేసుకుంది.

► కుతూహలమే గురువు
చిన్నప్పుడు సుధామూర్తికి ప్రతిదీ కుతూహలమే. వీధుల్లో కొట్లాటలు అవుతుంటే అక్కడకు పరిగెత్తి వెళ్లి నిలబడేది. వినోదం కోసం కాదు. కారణం ఏమై ఉంటుందా అని. చిన్న ఊళ్లో ప్రతి ఇల్లూ అందరికీ పరిచయమే. అందరి జీవితాలనూ ఆమె పరిశీలిస్తూ ఉండేది. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగితే ఆమె తప్పని సరిగా ఒక స్టీలు క్యారేజీ తీసుకుని బయలుదేరేది.

విందులో ఏ పదార్థాలు బాగున్నాయో ఏ పదార్థాలు బాగలేవో మొత్తం రుచి చూసి వస్తూ వస్తూ బాగున్న వాటిని క్యారేజీలో అడిగి తెచ్చుకునేది. కాలేజీ రోజుల వరకూ కూడా పెళ్ళిళ్లకు క్యారేజీ తీసుకోకుండా సుధామూర్తి వెళ్లేది కాదు. ‘ఎందుకో నాకు గిన్నెల క్యారేజీ అంటే నేటికీ ఇష్టం’ అంటుందామె.

► మసాలా దోసె పార్టీ
లెక్కలు బాగా నేర్చుకున్న సుధా హుబ్లీలోని బి.వి.బి. కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో చేరింది. ఇక ఆ రోజు నుంచి ఊళ్లోని పెద్ద మనుషులంతా ఆమె తండ్రి దగ్గరకు వచ్చి వాపోవడమే. ‘అమ్మాయిని ఇంజనీరింగ్‌ చదివిస్తున్నావ్‌. పెళ్లెవరు చేసుకుంటారు’ అని బెంగపడటమే. తండ్రి కూడా ఒక దశలో తప్పు చేశానా అనుకున్నాడు. కాని సుధామూర్తి మొదటి సంవత్సరానికి ఫస్ట్‌ క్లాస్‌లో పాసైంది. తండ్రికి సంతోషం కలిగింది.

‘ఫస్ట్‌ క్లాస్‌ తెచ్చుకున్నావ్‌ కదా... పద మసాలా దోసె పార్టీ చేసుకుందాం’ అని తీసుకెళ్లాడు. ప్రతి సంవత్సరం ఆమె ఫస్ట్‌క్లాస్‌ తెచ్చుకోవడం.. తండ్రి తీసుకెళ్లి మసాలా దోసె తినిపించడం. ఆ తండ్రీ కూతుళ్ల జీవితంలో పార్టీ చేసుకోవడం అంటే అదే. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ‘కాని ఆ పార్టీ ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. అపురూపం అనిపించేది’ అంటుందామె.

► చరిత్ర మార్చిన కార్డు ముక్క
1974లో టాటా వారి ‘టెల్కో’ సంస్థలో ఇంజనీరింగ్‌ ఉద్యోగాలు పడ్డాయి. పేపర్‌లో ఆ యాడ్‌ చూసింది సుధామూర్తి. అర్హతలు అన్నీ ఆమెకు ఉన్నాయి. కాని యాడ్‌ కింద ‘స్త్రీలు అప్లై చేయాల్సిన పని లేదు’ అని ఉంది. అప్పుడు సుధామూర్తికి ఆగ్రహం వచ్చింది. రోషం కలిగింది. జె.ఆర్‌.డి.టాటాకు ఒక కార్డు గీకి పడేసింది. ‘దేశంలో ఉన్న ఇంతమంది స్త్రీలకు పని చేసే హక్కు లేకపోతే వారు ఎలా అభివృద్ధిలోకి వస్తారు?’ అని ప్రశ్న. ఆ కార్డు జె.ఆర్‌.డి. టాటాకు చేరింది. ఆ వెంటనే ఆమెకు ఇంటర్వ్యూకు పిలుపు, ఆపై ఉద్యోగం వచ్చాయి.

పూణెలో సుధామూర్తి తొలి ఉద్యోగం చేసింది. ఆమె రాసిన లేఖను టాటా సంస్థ నేటికీ భద్రపరిచి ఉంచింది. 1974లో టెల్కోలో సుధామూర్తి ఒక్కతే మహిళా ఉద్యోగి. దాదాపు 50 ఏళ్ల తర్వాత సుధామూర్తి పూణెలో ఆ సంస్థను సందర్శిస్తే (ఇప్పుడు టాటా మోటార్స్‌) 900 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. ‘నేను అక్కడ నిలబడి మా తండ్రిని తలుచుకుని ఉద్వేగంతో కన్నీరు కార్చాను. ఎవరు భయపెట్టినా నన్ను ఆయన చదివించాడు. నా వల్ల ఇవాళ ఇంతమంది మహిళలు ఉద్యోగాల్లో ఉన్నారు అని’ అందామె.

► జీవితం అంతులేని పోరాటం
‘జీవితం అంటే అంతులేని పోరాటం. ఎవరికీ ఏ వయసులో ఉన్నా కన్సెషన్‌ ఉండదు. పోరాటం చేయాలి. ఓడిపోయినా పోరాట అనుభవం మిగులుతుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. క్షమిస్తే మంచిది. మర్చిపోతే ఇంకా మేలు. కాని ముందుకు సాగడమే అన్నింటికన్నా ఉత్తమమైనది. చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని మెరిపిస్తాయి. ప్యాషన్‌తో పని చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. ఒక మనిషిని పైకి తెచ్చేది డబ్బు కాదు ప్యాషన్‌. నమ్మిన పనిని విలువలతో ఆచరిస్తే ఎవరైనా పైకి రావాల్సిందే’ అంటుందామె.

► రాజ్యసభ సభ్యురాలు
‘ఇది ఊహించలేదు. రాష్ట్రపతి నన్ను రాజ్యసభకు నామినేట్‌ చేశారు. దీని గురించి నేను కూచుని ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. ఏం చేయగలనో అంతా చేయాలి. ఇప్పుడు నేను భారత ప్రభుత్వ సేవకురాలిని’ అని కొత్త బాధ్యతకు సిద్ధమవుతోంది సుధామూర్తి.                     

ఇల్లాలే శక్తి
నారాయణ మూర్తితో వివాహం అయ్యాక ఇన్ఫోసిస్‌ సంస్థను ఆయన స్థాపించాలనుకున్నప్పుడు 10 వేల రూపాయలు పెట్టుబడి తనే ఇచ్చింది సుధామూర్తి. అయితే ఆమెను ఇన్ఫోసిస్‌కు బయటి వ్యక్తిగానే ఉండటం మంచిదని సూచించాడు నారాయణమూర్తి. ఆమె కొంచెం బాధపడింది. ఎప్పటికైనా ఇన్ఫోసిస్‌ సంస్థలో చేరతాననే భావించింది. అదే సమయంలో చాలా కాలం పాటు పిల్లల కోసం గృహిణిగా ఉండిపోయింది. ‘సంవత్సరంలో 200 రోజులు ప్రయాణాల్లో ఉండేవాడు నారాయణమూర్తి. ఆ రోజుల్లో ఫోన్‌ లేదు. కారు లేదు. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక్కదాన్నే వెళ్లాలి. సంస్థ ఆర్థిక కష్టాలు.. ఇంటి కష్టాలు.. అన్నీ తట్టుకుని నారాయణమూర్తికి వెన్నుదన్ను అందించాను. ఆ తర్వాత ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌కు చైర్మన్‌ అయ్యాను. ఆ ఫౌండేషన్‌తో వేలాది మంది జీవితాల్లో వెలుగు తెచ్చే వీలు నాకు కలిగింది. ఈ సంతృప్తి ఇన్ఫోసిస్‌ డైరెక్టర్‌గా పని చేసి ఉంటే నాకు దక్కేది కాదు’ అంటుందామె.

Advertisement

What’s your opinion

Advertisement