
బెంగళూరు: దక్షిణాదిలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కర్ణాటకలో భాషా సెగ తగిలింది. దీనిని ఆమె అత్యంత తెలివిగా తప్పించుకున్నారు. మైసూర్‌లోని అలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డైమండ్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్నాటక సీఎం సిద్దరామయ్య ..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది.
రాష్ట్రపతిని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ‘మీకు కన్నడ వచ్చా?’ అని అడిగారు. అందుకు ఆమె నవ్వుతూ ‘రాదు’ అని సమాధానమిస్తూ.. ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారికి నా మాతృభాష కన్నడ కాదు. అయితే నాకు దేశంలోని అన్ని భాషలు, సంస్కృతులు, ఆచారాలు అంటే ఎంతో ఇష్టం. ప్రతీ భాషపై నాకెంతో గౌరవం ఉంది. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను బతికించుకునేందుకు తాపత్రయపడుతుంటారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను తమ పిల్లలకు నేర్పిస్తారు. అలా చేస్తున్నవారందరికీ నా అభినందనలు. ఇక కన్నడ విసయానికొస్తే.. ఈ భాషను నేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తాను’ అని ముర్ము అన్నారు.
President Murmu’s Kannada Moment
At AIISH Diamond Jubilee, #Karnataka CM Siddaramaiah asked President Murmu: “Do you know Kannada?”
President Murmu replies saying she respects all Indian languages & pledged to learn Kannada “little by little” ❤️ pic.twitter.com/r3BgDmE4Em— Nabila Jamal (@nabilajamal_) September 1, 2025
మూడు రోజుల పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము మైసూర్ విమానాశ్రయం చేరుకున్నాక ఆమెకు గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్, సీఎం సిద్ధరామయ్య ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ముర్ము ఏఐఐఎస్‌హెచ్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కన్నడలో ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం రాష్ట్రపతి వైపు చూసి నవ్వుతూ.. మీకు కన్నడ వచ్చా? అని అడిగారు. ఈ కార్యక్రమంలో కర్నాటక మంత్రులు, సీనియర్ నేతలు, బీజేపీ ఎంపీ యుధ్‌వీర్ తదితరులు పాల్గొన్నారు.