
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) లక్షలాది ఉద్యోగాలను తొలగించబోతోందన్న సమాచారం కలకలం సృష్టిస్తోంది. దాదాపు 6 లక్షల ఉద్యోగాలను రోబోలతో భర్తీ చేయాలని అమెజాన్ యోచిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ఒక నివేదిక తెలిపింది.
ఇదే నివేదికను ఉటంకిస్తూ జాసన్ అనే ‘ఎక్స్’ యూజర్ ఓ పోస్ట్ పెట్టారు. "న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. అమెజాన్ 6,00,000 మందిని భర్తీ చేయబోతోంది. నా ప్రకారం అయితే ఈ అంచనా తక్కువే. ఇక పదేళ్లలో మనుషులే బాక్సులు ప్యాక్ చేసి రవాణా చేస్తారనుకుంటే పిచ్చితనమే. ఇక ఆట ముగిసింది" అంటూ రాసుకొచ్చారు.
ఈ పోస్ట్ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) దృష్టిని ఆకర్షించింది. "ఏఐ, రోబోట్లు అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాయి" అని వాదనతో ఆయన ఏకీభవించారు. రానున్న యుగం ఎలా ఉంటుందో మస్క్ మరింత అంచనా వేశారు. భవిష్యత్తులో మనుషులు పనిచేయడమన్నది స్వచ్ఛందంగా ఉంటుందన్నారు. ఉదాహరణకు "దుకాణం నుండి కొనడానికి బదులుగా కూరగాయలను సొంతంగా పండించడం వంటిది" అని ఆయన పోస్ట్ లో వివరించారు.
అమెజాన్‌లో రోబోలతోనే మొత్తం పని?
అమెజాన్‌లో వివిధ విభాగాల్లో ఆటోమేషన్ ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయో తెలిపే అంతర్గత పత్రాలను చూసినట్లు నివేదిక పేర్కొంది. అయితే సుమారు 6,00,000 మానవ ఉద్యోగాలను రోబోలతో భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్న న్యూయార్క్ టైమ్స్ నివేదికను అమెజాన్ ఖండించింది. ఆ పత్రాలు అసంపూర్ణంగా ఉన్నాయని, సంస్థ మొత్తం నియామక వ్యూహాన్ని తెలిపేవికావని కంపెనీ తెలిపింది.
రాబోయే హాలిడే సీజన్ కోసం 2,50,000 మందిని నియమించాలని ఈ-కామర్స్ కంపెనీ యోచిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్ తెలిపారు. అలాగే నిబంధనల విషయంలో సిబ్బందిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని, కమ్యూనిటీ ప్రమేయానికి, ఆటోమేషన్ కు సంబంధం లేదని అమెజాన్ వివరించింది.