విప్రో బంపర్‌ బైబ్యాక్‌! | Wipro Launches Rs 15000 Cr Share Buyback at Premium Amid Flat Q4 Profit | Sakshi
Sakshi News home page

విప్రో బంపర్‌ బైబ్యాక్‌!

Apr 17 2026 8:00 AM | Updated on Apr 17 2026 8:37 AM

Wipro Launches Rs 15000 Cr Share Buyback at Premium Amid Flat Q4 Profit

షేరుకు రూ.250 చొప్పున తిరిగి కొనుగోలు

రూ. 15,000 కోట్ల భారీ కేటాయింపు

క్యూ4 లాభం రూ. 3,502 కోట్లు

ఫ్లాట్‌గా క్యూ1 ఆదాయ అంచనా

ఐటీ సర్వీసుల దేశీ దిగ్గజం విప్రో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు తెరతీసింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధిక స్థాయిలో రూ. 15,000 కోట్లు వెచ్చించనుంది. మరోపక్క క్యూ4లో నికర లాభం 2 శాతం నీరసించి రూ.3,502 కోట్లకు చేరింది. 

సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం విప్రో భారీస్థాయిలో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. ఒక్కో షేరుకీ రూ. 250 ధరలో 5 శాతానికిపైగా వాటా(దాదాపు 60 కోట్ల షేర్లు) కొనుగోలు చేయనుంది. ఇందుకు ఏకంగా రూ. 15,000 కోట్లు కేటాయించింది. గురువారం మార్కెట్‌ ధర రూ. 210తో పోలిస్తే 18 శాతం ప్రీమియంతో ఈక్విటీ షేర్ల  బైబ్యాక్‌ను చేపట్టనుంది. చెల్లించిన మూలధనంలో  5.7 శాతం వాటాను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు విప్రో సీఎఫ్‌వో అపర్ణ అయ్యర్‌ తెలియజేశారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లో బైబ్యాక్‌ పూర్తికాగలదని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేశారు. బైబ్యాక్‌లో ప్రమోటర్, సంబంధిత గ్రూప్‌ పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది(2026–27) తొలి త్రైమాసికంలో ఐటీ సర్వీసుల బిజినెస్‌ నామమాత్ర క్షీణత(2 శాతం) లేదా యథాతథంగా 259.7–265.1 కోట్ల డాలర్లమధ్య నమోదుకాగలదని విప్రో తాజాగా అంచనా(గైడెన్స్‌) వేసింది.  

లాభం ఫ్లాట్‌

గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో విప్రో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం వార్షికంగా 2 శాతం నీరసించి రూ. 3,502 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2025–26) ఇదే కాలంలో రూ. 3,570 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 24,236 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 22,504 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. త్రైమాసికవారీగా క్యూ4లో విప్రో నికర లాభం 12 శాతం, ఆదాయం 3 శాతం చొప్పున బలపడ్డాయి.

ఇతర విశేషాలు

  • క్యూ4లో ఐటీ సర్వీసుల ఆదాయం 2 శాతం వార్షిక వృద్ధితో 265.1 కోట్ల డాలర్లకు చేరింది.

  • 3 శాతం వృద్ధితో 345.5 కోట్ల డాలర్ల విలువైన బుకింగ్స్‌(డీల్స్‌) నమోదయ్యాయి.

  • మార్చితో ముగిసిన 2025–26లో ఫ్లాట్‌గా రూ. 13,197 కోట్ల నికర లాభం ఆర్జించింది.

  • మొత్తం ఆదాయం 4 శాతం పుంజుకుని రూ. 92,624 కోట్లను తాకింది.

  • కంపెనీ సిబ్బంది సంఖ్య 2,33,346 నుంచి 2,42,156కు బలపడింది.

  • మొత్తం 7,500 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంది. క్యూ4లో 3,000 మందికి చోటిచ్చింది.

లాభాలకు సవాళ్లు...

లాభాలపై రాజకీయ, భౌగోళిక, పాలసీ సంబంధ సవాళ్లు ప్రభావం చూపాయి. అయితే ఐటీ వ్యయాలు నిలకడగా నమోదవుతున్నాయి. సాధారణ రీతిలోనే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌–జూన్‌) ఫలితాలు బలహీనంగా వెలువడనున్నాయి. ఇందుకు యూఎస్‌ డీల్స్‌ ఆలస్యం, క్లయింట్‌ సమస్యలు ప్రభావం చూపనున్నాయి. 

– విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా

ఐటీ దిగ్గజాల బైబ్యాక్‌ తీరిలా

విప్రో తాజా బైబ్యాక్‌కు టెండర్‌ మార్గంలో తెరతీయనుంది. ఇంతక్రితం 2023లోనూ రూ. 12,000 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ చేపట్టింది. ఇక  ఇన్ఫోసిస్‌ గతేడాది బైబ్యాక్‌కు రూ. 18,000 కోట్లు వెచ్చించింది. వెరసి అతి భారీ బైబ్యాక్‌ చేపట్టిన దేశీ కంపెనీగా రికార్డ్‌ నెలకొల్పింది. 2023 డిసెంబర్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూ. 17,000 కోట్లతో బైబ్యాక్‌ను పూర్తి చేసింది. మరో ఐటీ కంపెనీ సైయెంట్‌ సైతం బైబ్యాక్‌ ప్రతిపాదన పరిశీలనకు ఈ నెల 23న బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం!

ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్‌లతో కాసుల వేట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement