‘న్యూడిఫై’ యాప్‌లతో కాసుల వేట! | Tech Giants Double Standards Transparency vs Exploitation | Sakshi
Sakshi News home page

‘న్యూడిఫై’ యాప్‌లతో కాసుల వేట!

Apr 16 2026 2:17 PM | Updated on Apr 16 2026 2:43 PM

Tech Giants Double Standards Transparency vs Exploitation

సాంకేతిక ప్రపంచంలో పారదర్శకత, భద్రత గురించి గొప్పలు చెప్పుకునే యాపిల్, గూగుల్ సంస్థల అసలు రంగు బయటపడిందని కొందరు టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అశ్లీలతను, ఏకాభిప్రాయం లేని లైంగిక కంటెంట్‌ను ప్రోత్సహించబోమని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఈ టెక్ దిగ్గజాలు వాస్తవానికి ‘న్యూడిఫై’(లైంగిక పరమైన) యాప్‌ల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాయని ‘టెక్ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్ట్’ (టీటీపీ) తాజా నివేదికలో బయటపెట్టింది.

కోట్లలో డౌన్‌లోడ్‌లు.. వందల కోట్లలో ఆదాయం!

టెక్ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం, యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లలో కృత్రిమ మేధ సాయంతో సాధారణ వ్యక్తుల, సెలబ్రిటీల ఫొటోల నుంచి దుస్తులను తొలగించి నగ్నంగా మార్చే అన్‌డ్రెస్ లేదా న్యూడిఫై యాప్‌లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ తరహా యాప్‌లు ఇప్పటివరకు సుమారు 483 మిలియన్ల సార్లు డౌన్‌లోడ్ అయ్యాయి. యాప్ మ్యాజిక్ గణాంకాల ప్రకారం, వీటి ద్వారా ఈ కంపెనీలు 122 మిలియన్‌ డారల్లు (సుమారు రూ.1,000 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించాయి. యాపిల్ స్టోర్‌లో 18, గూగుల్ ప్లే స్టోర్‌లో 20 ఇలాంటి యాప్‌లను పరిశోధకులు గుర్తించారు.

సెర్చ్ చేస్తే చాలు.. ప్రకటనలే స్వాగతం!

వినియోగదారులు యాప్‌ స్టోర్‌ల్లో న్యూడిఫై వంటి పదాల కోసం వెతికినప్పుడు ఈ యాప్‌లు కనిపించడమే కాకుండా కంపెనీలు స్వయంగా వాటికి సంబంధించిన ప్రకటనలను కూడా ప్రదర్శిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా ఆటోకంప్లీట్ ఫీచర్ ద్వారా వినియోగదారులను నేరుగా ఇటువంటి అశ్లీల యాప్‌ల వైపు మళ్లిస్తున్నాయని నివేదిక తీవ్రంగా విమర్శించింది. ‘ఈ కంపెనీలు కేవలం యాప్‌లను ఆమోదించడమే కాదు, వాటి ద్వారా లాభం పొందుతూ వినియోగదారులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి’ అని టెక్ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేటీ పాల్ అన్నారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

యాపిల్ మార్గదర్శకాలు బహిరంగ లైంగిక లేదా అశ్లీల కంటెంట్‌ను స్పష్టంగా నిషేధిస్తున్నాయి. గూగుల్ సైతం వ్యక్తులను దిగజార్చే ‘ప్రాంక్’ పేరుతో బట్టలు విప్పినట్లు చూపే యాప్‌లను అనుమతించబోమని చెబుతోంది. అయితే, ఫొటో ఎడిటింగ్ యాప్‌లుగా ముసుగు వేసుకుని వచ్చే ఇటువంటి సాఫ్ట్‌వేర్‌లను గుర్తించడంలో ఈ కంపెనీలు విఫలమవుతున్నాయి.

అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి

నగ్నత్వ యాప్‌ల వల్ల మహిళలు, చిన్నారుల భద్రత ప్రమాదంలో పడుతోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ‘టేక్ ఇట్ డౌన్’ చట్టంపై సంతకం చేశారు. ఇది ఏకాభిప్రాయం లేని లైంగిక చిత్రాలను ప్రచురించడాన్ని నేరంగా పరిగణిస్తుంది. అశ్లీల చిత్రాలను తొలగించని టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లను విచారించేలా యూకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది.

దిద్దుబాటా? కంటితుడుపు చర్యలా?

బ్లూమ్‌బెర్గ్, టీటీపీ నివేదికల అనంతరం, యాపిల్ సుమారు 15 యాప్‌లను తొలగించినట్లు తెలిపింది. గూగుల్ కూడా పలు యాప్‌లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. అయితే, ఒకసారి తొలగించిన యాప్‌లు కొన్ని నెలలకే మళ్లీ కొత్త పేర్లతో ప్రత్యక్షమవుతున్నాయని, టెక్ దిగ్గజాల పర్యవేక్షణ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం లాభాల కోసం నైతికతను పక్కన పెడుతున్న ఇలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: కాకమీదున్న పసిడి ధరలు

Advertisement
 
Advertisement
Advertisement