ఏఐ విస్తృతంగా పెరుగుతున్నకొద్దీ అన్ని రంగాల్లోనూ ఉద్యోగాల కోతలు అధికమయ్యాయి. మరోవైపు చాలా రంగాల్లో ఉద్యోగ మార్పులు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో జాబ్ మార్కెట్‌లో నయా ట్రెండ్ నడుస్తోంది. కొత్త ఉద్యోగాలపై యువత చూస్తున్నారు. ఏ కొలువులకు డిమాండ్ ఉందో అన్వేషిస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవల విస్తరణతో సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగాలపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. అయితే ఉద్యోగార్థుల ఆసక్తి పెరుగుతున్న స్థాయిలోనే కంపెనీల నియామకాలు మాత్రం జరగడం లేదు. దీంతో సైబర్ సెక్యూరిటీలో ఏ విభాగానికి డిమాండ్ ఎక్కువగా ఉంది? ఏ నైపుణ్యాలకు ప్రాధాన్యం లభిస్తోంది? అనే అంశాలు కీలకంగా మారుతున్నాయి.
జాబ్స్ పోర్టల్ ఇన్‌డీడ్ ఇండియా (Indeed India) తాజా డేటా ప్రకారం.. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన నాలుగు ప్రధాన విభాగాల్లో ఉద్యోగార్థుల ఆసక్తి భారీగా పెరిగింది. ఎస్‌ఓసీ అనలిస్ట్ (Security Operations Centre) (SOC Analyst)ఉద్యోగాలపై క్లిక్‌లు ఏకంగా 225% పెరిగాయి. ప్రైవసీ/డేటా ప్రొటెక్షన్ పాత్రలపై ఆసక్తి 189%, సెక్యూరిటీ ఇంజనీర్ పోస్టులపై 176%, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఉద్యోగాలపై 175% పెరిగింది.
కంపెనీల నియామకాల్లో మాత్రం భిన్న ధోరణి
ఉద్యోగార్థుల ఆసక్తికి, కంపెనీల నుంచి వస్తున్న ఉద్యోగ ప్రకటనలకు మధ్య గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఇన్‌డీడ్ డేటా ప్రకారం.. ప్రైవసీ/డేటా ప్రొటెక్షన్ ఉద్యోగాల పోస్టింగ్స్ 18%, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టింగ్స్ 9% పెరిగాయి. అదే సమయంలో సెక్యూరిటీ ఇంజనీర్ ఉద్యోగ ప్రకటనలు సుమారు 1%, SOC అనలిస్ట్ పోస్టింగ్స్ 8% తగ్గాయి. అంటే సైబర్ సెక్యూరిటీ రంగంపై ఆసక్తి విస్తృతంగా పెరుగుతున్నప్పటికీ, అన్ని స్పెషలైజేషన్లలో ఉద్యోగ అవకాశాలు ఒకే వేగంతో పెరగడం లేదని డేటా సూచిస్తోంది.
ఈ స్కిల్స్ ఉంటే అవకాశాలు
కంపెనీల సైబర్ సెక్యూరిటీ ఉద్యోగ ప్రకటనల్లో తరచుగా కనిపిస్తున్న నైపుణ్యాల్లో ‘ఫైర్‌వాల్’ ముందంజలో ఉంది. సంబంధిత ఉద్యోగ పోస్టింగ్స్‌లో ఇది 19.6% చోటుచేసుకుంది. ఆ తర్వాత ISO 27001 (17.5%), SIEM (15.2%), నెట్‌వర్క్ సెక్యూరిటీ (12%), వల్నరబిలిటీ అసెస్‌మెంట్ (11.6%) ఉన్నాయి.
ఫైర్‌వాల్ నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను నియంత్రించడంలో, SIEM వివిధ భద్రతా లాగ్‌లు, అలర్ట్‌లను విశ్లేషించడంలో, వల్నరబిలిటీ అసెస్‌మెంట్ వ్యవస్థల్లోని భద్రతా లోపాలను గుర్తించడంలో ఉపయోగపడతాయి. ISO 27001 మాత్రం సంస్థల సమాచార భద్రత నిర్వహణ వ్యవస్థలకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణం. దీంతో సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు కేవలం హ్యాకింగ్ లేదా పెనెట్రేషన్ టెస్టింగ్‌కే పరిమితం కావడం లేదని స్పష్టమవుతోంది.
AIతో కొత్త విభాగాలు
AI, క్లౌడ్, API ఆధారిత వ్యవస్థలు, డిజిటల్ సేవల విస్తరణతో సైబర్ దాడులకు గురయ్యే పరిధి కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం మరింత విస్తరిస్తోంది. DSCI–SANS 2025-26 నివేదిక ప్రకారం.. 73% సంస్థలు, 68% సర్వీస్ ప్రొవైడర్లు నైపుణ్యం కలిగిన సైబర్ సెక్యూరిటీ అభ్యర్థుల కొరత ఉందని పేర్కొన్నాయి. అలాగే 83% సంస్థలు AI, GenAI సెక్యూరిటీ నైపుణ్యాలను కీలక అవసరంగా గుర్తించాయి.
ఇదే సమయంలో డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడంలో కంపెనీలకు సహకారం అందించే గార్ట్‌నర్ సంస్థ అంచనా ప్రకారం.. భారత్‌లో సమాచార భద్రతపై సంస్థల వ్యయం 2026లో 11.7% పెరిగి 3.4 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. AI ఆధారిత సైబర్ ముప్పులు, గుర్తింపు ఆధారిత దాడులు, నియంత్రణ అవసరాలు ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
మొత్తంగా చూస్తే.. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగార్థుల ఆసక్తి వేగంగా పెరుగుతున్నా, ఉద్యోగం సాధించేందుకు కేవలం సైబర్ సెక్యూరిటీపై ఆసక్తి సరిపోదు. ఫైర్‌వాల్, SIEM, నెట్‌వర్క్ సెక్యూరిటీ, ISO 27001తో పాటు క్లౌడ్ సెక్యూరిటీ, AI/GenAI సెక్యూరిటీ, ప్రాక్టికల్ హ్యాండ్స్-ఆన్ నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడం అవకాశాలను మెరుగుపరచే అంశాలుగా కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: కొత్త ఫోన్, టీవీ.. 9 నుంచే ఆఫర్ల జాతర


