
యూఎస్ నుంచి వచ్చి 750 మందికి ఉపాధి
అమెరికాలో 14 ఏళ్లు పనిచేసి న్యూయార్క్ నుంచి చెన్నైకి వచ్చిన ఓ వ్యక్తి స్టార్టప్ సంస్థ ప్రారంభించినట్లు తెలిపిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. యూఎస్ నుంచి ఇండియా వచ్చే సమయంలో తన తన బ్యాంక్ ఖాతాలో కేవలం రూ.90,000 మాత్రమే ఉన్నాయని లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. ఎలాంటి ఆర్థిక భరోసా లేకుండా 11 నెలల చిన్నారితో యూఎస్ నుంచి భారత్ వస్తున్న తనను తన భార్య ఓ పిచ్చిడిలా చూసినట్లు చెప్పుకొచ్చారు. వివేక్ తిరువేంగడం చేసిన ఈ పోస్ట్‌కాస్తా వైరల్‌గా మారింది.
‘యూఎస్ నుంచి భారత్ రావాలని నిర్ణయించుకొని 2020 డిసెంబర్ 23న న్యూయార్క్ నుంచి చెన్నైకి వన్-వే ఫ్లైట్ టిక్కెట్ తీసుకున్నాను. ఆ సమయంలో నా బ్యాంకు ఖాతాలో రూ.90,000 ఉన్నాయి. 11 నెలల చిన్నారిని, నా భార్యను తీసుకొని విమానం ఎక్కాను. నా భార్య నన్నో పిచ్చోడిలా చూసింది. ఇండియా వచ్చేది మరో కంపెనీలో చేరడానికో.. మంచి వేతనం కోసం పని చేసేందుకో కాదు. స్టార్టప్ కంపెనీ పెట్టాలని భావించాను. కొవిడ్ సమయంలో అది అంత సులువు కాదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. జాబ్ లేదు, ఆఫీస్ లేదు, ఇన్వెస్టర్లు లేరు. కేవలం ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే ఉన్నాయి’ అని తిరువేంగడం ఉన్నారు.
‘వర్కింగ్ ప్రొఫెషనల్స్ లక్ష్యంగా ఫిట్‌నెస్ కంపెనీని ప్రారంభించాలనుకున్నాను. కానీ కరోనా ప్రభావం కారణంగా ఇంకొంత కాలం వెయిట్ చేయమని కొందరు సలహా ఇచ్చారు. వారి మాటలు పట్టించుకోకుండా వెంటనే సంస్థను మొదలు పెట్టాను. ఐదేళ్ల తర్వాత చూస్తే నా కంపెనీలో 750+ ఉద్యోగులున్నారు. ఆరుగురితో కూడిన ప్రత్యేక బృందం కంపెనీని నడుపుతోంది’ అని చెప్పారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘14 ఏళ్లుగా అమెరికాలో ఉంటే కేవలం రూ.90వేలు మాత్రమే మిగిలాయా? ఏం జరిగిందో వివరంగా చెప్పగలరా?’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘ఎలాంటి సేఫ్టీ లేకుండా ఇలాంటి సాహసం చేయడం నిజంగా భయంకరమైన విషయం’ అని మరొకరు చెప్పారు.

ఇదీ చదవండి: పేరుకుపోతోన్న ‘వీఐ’ అప్పుల కుప్ప
జీవితంలో ఆర్థికపరమైన నిర్ణయం తీసుకునేముందు జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. అందరికీ ఇలా విజయం సాధించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే సాహసోపేత నిర్ణయం తీసుకునేముందు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని చెబుతున్నారు. ఏదైనా అత్యవసర సమయాల్లో కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలంటే లైఫ్‌స్టైల్‌కు అవసరమయ్యేలా కనీసం ఏడాదిపాటు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్‌ను క్రియేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.