
నాన్ బ్యాంకింగ్ వనరుల ద్వారా నిధుల సమీకరణకు యత్నం
బ్యాంకులు వంటి సంప్రదాయ రుణదాతల నుంచి కొత్త రుణాలు పొందడంలో అడ్డంకులు ఎదురవుతుండటంతో వొడాఫోన్ ఐడియా (వీఐ) బ్యాంకింగేతర వనరుల ద్వారా నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోంది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)కు సంబంధించిన బకాయిలు పెరుగుతున్నాయి. కంపెనీ మొత్తం రుణాలు రూ.2 లక్షల కోట్లకుపైగా పేరుకుపోవడంతో వీఐ ఈమేరకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రముఖ బ్యాంకులతో రుణాలపై చర్చలు నిలిచిపోవడంతో వీఐ మూలధన వ్యయం (కాపెక్స్) ప్రణాళికలను కొనసాగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
నాన్ బ్యాంక్ ఫండింగ్
వీఐ ఏజీఆర్ బకాయిల భారం రూ.75,000 కోట్లకు చేరడంతో కంపెనీ ఆర్థిక స్థిరత్వంపై ఆందోళనలు నెలకొన్నాయి. ఏజీఆర్ రుణాల పరిష్కారంపై మరింత స్పష్టత వచ్చే వరకు బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. దాంతో సంప్రదాయ ఆర్థిక సంస్థల నుంచి నిధుల సమీకరణకు బదులుగా బ్యాంకింగేతర సంస్థల్లో రుణాల కోసం ప్రయత్నిస్తోంది. రూ.50,000-రూ.55,000 కోట్ల కాపెక్స్ కోసం ప్రైవేట్ క్రెడిట్ ఫండ్స్, ఇతర నాన్ బ్యాంకింగ్ రుణదాతల నుంచి నిధులను కోరుతోంది. దేశంలోని 17 సర్కిళ్లలో 5జీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు సమకూర్చడంపై కంపెనీ దృష్టి సారించింది.
ముందస్తు చర్చల్లో కొన్ని కంపెనీలు
డేవిడ్సన్ కెంప్నర్, ఓక్‌ట్రీ, వెర్డే పార్ట్‌నర్స్ వంటి సంస్థలు వీఐకి స్వల్పకాలిక రుణాన్ని అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే సంప్రదాయ బ్యాంకుల నుంచి వీఐ కోరిన రూ.25,000 కోట్లతో పోలిస్తే ఈ సంస్థలు తక్కువ మొత్తాన్ని అందించే అవకాశం ఉంది. కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.2,440 కోట్లు ఖర్చు చేసింది. తన నెట్వర్క్ విస్తరణ, 5జీ రోల్‌అవుట్‌ను కొనసాగించడానికి సెప్టెంబర్ 2025 నాటికి మరో రూ.5,000–రూ.6,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చదవండి: యూపీఐ వినియోగంలో టాప్‌లో ఉన్న రాష్ట్రం ఇదే..
ఏజీఆర్ బకాయిలపై ప్రభుత్వం జోక్యం
అపరిష్కృతంగా ఉన్న ఏజీఆర్ బకాయిల సమస్య వీఐ ఆర్థిక వృద్ధికి అవరోధంగా మారింది. 2026 మార్చి లోపు ఏజీఆర్ బకాయిలను పరిష్కరించాలని కంపెనీ భారత ప్రభుత్వాన్ని కోరింది. అప్పులను తగ్గించి, బ్యాంకుల నుంచి కొత్త మూలధనాన్ని సమీకరించేందుకు వీలు కల్పించేలా ప్రభుత్వ సహకారంపై కంపెనీ ఆశలు పెట్టుకుంది.