
యూపీఐ వినియోగంలో దేశంలోనే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉందని ఎస్‌బీఐ ఎకనామిక్ రిసెర్చ్ డిపార్ట్‌మెంట్(ఈఆర్డీ) తెలిపింది. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. అయితే కొన్ని టీపీఏపీల(థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) మధ్య లావాదేవీలు అధికంగా జరుగుతుండడంతో దేశంలో ఫిన్‌టెక్ ఆవిష్కరణలు దెబ్బతింటున్నట్లు హెచ్చరించింది.
ఎస్‌బీఐ ఈఆర్డీ తొలిసారిగా ప్రచురించిన యూపీఐ లావాదేవీలపై రాష్ట్రాల వారీగా డేటాను ప్రస్తావిస్తూ, జులైలోనే 9.8 శాతం వాల్యూమ్(యూపీఐల సంఖ్య) వాటాతో మహారాష్ట్ర స్థిరంగా ముందంజలో ఉందని తెలిపింది. కర్ణాటక (5.5 శాతం), యూపీ (5.3 శాతం), తెలంగాణ (4.1 శాతం), తమిళనాడు (4 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఈఆర్డీలో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. జులై నెలలోనే డిజిటల్ చెల్లింపుల్లో(విలువ) మహారాష్ట్ర 9.2 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక (5.8 శాతం), యూపీ (5.3 శాతం), తెలంగాణ (5.1 శాతం), తమిళనాడు (4.7 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఇదీ చదవండి: ఉద్యోగులకు ఆదివారాలు పని.. వివరణ ఇచ్చిన ఎల్ అండ్ టీ ఛైర్మన్
విలువ, వాల్యూమ్ పరంగా యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. 2025లోనే సగటు రోజువారీ విలువ జనవరిలో రూ.75,743 కోట్ల నుంచి జులైలో రూ.80,919 కోట్లకు, ఆగస్టులో రూ.90,446 కోట్లకు (ఇప్పటివరకు) పెరిగింది.