
ఉద్యోగులు ఆదివారాల్లోనూ పనిచేయాలని సూచిస్తూ లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ కొంతకాలం కిందట చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇటీవల వివరణ ఇచ్చారు. అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా మందకొడిగా సాగుతున్న ప్రాజెక్టు పురోగతిపై అంతర్గతంగా చర్చించామన్నారు. అందులో భాగంగా అనధికారిక సంభాషణ సందర్భంగా సుబ్రమణ్యన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించారు.
‘అప్పుడు ఉన్న పర్థితులు భిన్నంగా ఉన్నాయి. కంపెనీతో బిజినెస్ చేస్తున్న ఐదారుగురు క్లయింట్లతోపాటు కొందరు హైప్రొఫైల్ క్లయింట్లు నాతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఉత్పాదకతకు సంబంధించి ఫోన్ చేశారు. మా పురోగతి గురించి ఈమెయిల్స్ పంపారు. నాతోపాటు టీమ్ ప్రమేయం ఉన్నప్పటికీ ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు. ఆ సందర్భంలో అనధికారికంగా ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. కానీ దీన్ని తప్పకుండా పాటించాలనేలా మాత్రం చెప్పలేదు. ఈ అనధికారిక సంభాషణ సమయంలో రికార్డ్ చేయొద్దనే నియమాలున్నాయి’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు..
ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో, ఉద్యోగ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. తన భార్య కూడా తన పేరుకు భంగం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సుబ్రమణ్యన్ చెప్పారు. ‘ఈ సంఘటన నా మనసును ఉంతో కలచివేసింది. ఏదేమైనా విషయం జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకోలేను. ఎల్ అండ్ టీలో పనితీరే కీలకం’ అని అన్నారు.