ఆదాయపు పన్ను (ఐటీ) రీఫండ్‌ల జారీలో జరుగుతున్న జాప్యంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్ చేసిన తప్పుడు తగ్గింపులు (Incorrect Deductions) లేదా అధిక విలువ గల క్లెయిమ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నందున రీఫండ్‌ల ఆలస్యం జరుగుతోందని స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఐటీఆర్ (ITR) దాఖలు గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్ల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సీబీడీటీ ఛైర్మన్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)లో పన్ను చెల్లింపుదారుల లాంజ్‌ను ప్రారంభించిన అనంతరం అగర్వాల్ విలేకరులతో మాట్లాడారు.
‘తక్కువ విలువ కలిగిన రీఫండ్లను ఇప్పటికే విడుదల చేస్తున్నాం. మిగిలిన రీఫండ్‌లను ఈ నెలలో లేదా డిసెంబర్ నాటికి విడుదల చేస్తాం. పన్ను శాఖ కొన్ని తప్పుడు తగ్గింపులు, అధిక విలువ గల రీఫండ్ క్లెయిమ్‌లను గుర్తించింది. వాటిని ధ్రువీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్లెయిమ్‌లను సిస్టమ్ ద్వారా రెడ్-ఫ్లాగ్ చేశాం. పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్ చేసిన తప్పుడు తగ్గింపులపై విశ్లేషణ నిర్వహిస్తున్నాం. ఇది రీఫండ్‌ల జారీలో జాప్యానికి కారణం అవుతుంది’ అని అగర్వాల్ పేర్కొన్నారు.
మరోవైపు, ఏదైనా తగ్గింపులను మర్చిపోయిన పన్ను చెల్లింపుదారులు సవరించిన రిటర్న్ (Revised Return) దాఖలు చేయాలని కోరుతూ వారికి లేఖలు రాసినట్లు కూడా ఆయన వెల్లడించారు. టీడీఎస్ (మూలం వద్ద పన్ను తగ్గింపు) రేట్లు హేతుబద్ధీకరించబడటం వల్ల రీఫండ్ క్లెయిమ్‌ల్లో కూడా తేడాలుంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 మధ్య రీఫండ్‌లు రూ.2.42 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
వ్యాజ్యాల తగ్గింపుపై దృష్టి
ప్రత్యక్ష పన్ను కేసులకు సంబంధించిన వ్యాజ్యాలను తగ్గించడానికి డిపార్ట్‌మెంట్, బోర్డు తీవ్రంగా కృషి చేస్తున్నాయని అగర్వాల్ తెలిపారు. అప్పీలేట్ అధికారులు ఓవర్ టైమ్ పని చేస్తున్నారని చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 40 శాతానికి పైగా అప్పీళ్లు పరిష్కరించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: అమెరికాపై తగ్గని మోజు!


