
జీఎస్టీ హై స్లాబ్‌ల రద్దు దిశగా కేంద్రం ప్రతిపాదనలు
28% , 12% స్లాబులను రద్దు చేయనున్న కేంద్ర ప్రభుత్వం
18 శాతం, 5% స్లాబ్‌లుగా వర్గీకరణ చేస్తూ కొత్త ప్రతిపాదనలు
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకరించే పనిని కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఈ మేరకు కీలక ప్రతిపాదనలు రూపొందించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగు ప్రధాన స్లాబ్‌లను కుదించి రెండు ప్రధాన స్లాబ్‌లుగా మారుస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. 12 శాతం, 28 శాతం, స్లాబ్‌లను రద్దు చేసి 5 శాతం, 18 శాతం మాత్రమే కొనసాగించాలన్న ఆలోచనను కేంద్ర ఆర్థిక శాఖ ముందుంచినట్లు సమాచారం.
నూతన ప్రతిపాదనల ప్రకారం.. 28 శాతం స్లాబ్ పరిధిలోని 90 శాతం వస్తువులను 18 శాతం పరిధిలోకి, అలాగే 12 శాతం స్లాబ్ పరిధిలోని 99 శాతం వస్తువులను 5 శాతం కిందికి తీసుకురానున్నారు. ప్రస్తుతం 12 శాతం స్లాబ్‌లో ఉన్న టూత్‌పేస్ట్, మొబైల్ ఫోన్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, బట్టలు, బూట్లు వంటి మధ్యస్థాయి వినియోగ వస్తువులను 5 శాతం స్లాబ్‌లోకి మార్చే యోచన ఉంది. ఇదే సమయంలో, 28 శాతం స్లాబ్‌లో ఉన్న కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొన్ని సేవలను 18 శాతం స్లాబ్‌లోకి తరలించనున్నారు.
ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్
జీఎస్టీ పన్ను నిర్మాణంలో ప్రధానంగా రెండు స్లాబ్‌లే కొనసాగనున్నప్పటికీ కొన్ని హానికరమైన వస్తువుల కోసం ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్‌ను ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ స్లాబ్‌లో తంబాకు, గుట్కా, సిగరెట్లు వంటి కేవలం 5–7 వస్తువులే ఉండే అవకాశం ఉంది.
ఈ మార్పుల వల్ల నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గి, వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేదవర్గాలపై నెలవారీ ఖర్చుల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. కేంద్రం అంచనా ప్రకారం, ఈ స్లాబ్ మార్పుల వల్ల రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకు రెవెన్యూ నష్టం జరగవచ్చని భావిస్తున్నప్పటికీ, వినియోగం పెరిగి, పన్ను ఆదాయం తిరిగి స్థిరపడే అవకాశం ఉందని అధికారులు విశ్వసిస్తున్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులు ఇప్పటికీ జీఎస్టీ పరిధిలోకి లేవు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ జీఎస్టీ మార్పులను "డబుల్ దీపావళి గిఫ్ట్"గా ప్రజలకు ప్రకటించారు. పన్ను వ్యవస్థను సరళీకరించడం ద్వారా ప్రజలపై పన్ను భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.