1200 KM రేంజ్‌: వచ్చేస్తోంది బీవైడీ ‘సీల్‌ యూ’.. కొత్త రకం హైబ్రిడ్‌ కారు | BYD Seal U Plug in Hybrid SUV India Launch 1200KM Range | Sakshi
Sakshi News home page

1200 KM రేంజ్‌: వచ్చేస్తోంది బీవైడీ ‘సీల్‌ యూ’.. కొత్త రకం హైబ్రిడ్‌ కారు

Jun 10 2026 9:40 PM | Updated on Jun 10 2026 9:44 PM

BYD Seal U Plug in Hybrid SUV India Launch 1200KM Range

న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రిక్‌ వాహన దిగ్గజం ‘బీవైడీ’ భారత అనుబంధ సంస్థ బీవైడీ ఇండియా, దేశీయ మార్కెట్లో తన తొలి ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్‌ ఎస్‌యూవీ ‘సీల్‌ యూ’ను ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. కంపెనీ అభివృద్ధి చేసిన డీఎం–ఐ (డ్యూయల్‌ మోడ్‌ ఇంటెలిజెంట్‌) సాంకేతికత ఆధారంగా రూపొందిన తొలి వాహనం ఇదేనని తెలిపింది. దీని ధర, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలను లాంచ్‌ సమయంలోనే వెల్లడిస్తామని సంస్థ పేర్కొంది.

‘ఎలక్ట్రిక్‌–ఫస్ట్‌ విధానంలో పనిచేసే డీఎం–ఐ 
సాంప్రదాయ హైబ్రిడ్‌ వాహనాల్లో పెట్రోల్‌ ఇంజిన్‌ ప్రధానంగా ఉండి, బ్యాటరీ కేవలం అదనపు సపోర్ట్‌ ఇస్తుంది. కానీ, బీవైడీ పరిచయం చేస్తున్న డీఎం–ఐ టెక్నాలజీ దీనికి భిన్నంగా ‘ఎలక్ట్రిక్‌–ఫస్ట్‌’ విధానంలో పనిచేస్తుంది. అంటే, రోజువారీ ప్రయాణాల్లో కారు గరిష్టంగా బ్యాటరీతోనే నడుస్తుంది. దూర ప్రయాణాల్లో లేదా బ్యాటరీ అయిపోతున్న సమయంలో మాత్రమే మైలేజ్‌ పెంచడానికి పెట్రోల్‌ ఇంజిన్‌ సహాయపడుతుంది. ఈ సరికొత్త ‘సీల్‌ యూ ఎస్‌యూవీ’ని విదేశాల నుండి నేరుగా భారత్‌కు దిగుమతి చేయనున్నారు. భారత్‌లోనే బ్యాటరీల తయారీపై కంపెనీ ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

పెరుగుతున్న ఈవీ డిమాండ్‌ 
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రికత్తల కారణంగా ఈ మే నెలలో ఇంధన ధరలు నాలుగు సార్లకు పైగా పెరగడంతో భారత్‌లో ఈవీల పట్ల ఆసక్తి పెరిగిందని రాజీవ్‌ చౌహాన్‌ తెలిపారు. ‘వాహన్‌’ డేటా ప్రకారం.. మే నెలలో దేశంలో రికార్డు స్థాయిలో దాదాపు 25,000 ఈవీ కార్లు అమ్ముడయ్యాయి. భారత్‌లో ఇప్పటికే 14,000 మందికి పైగా బీవైడీ కస్టమర్లు ఉన్నారు. పూర్తి ఎలక్ట్రిక్‌ కార్లకు మారే ముందు కస్టమర్లకు ఇదొక ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని చౌహాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.  

1,200 కి.మీ పరిధి 
‘‘ఒక్కసారి పూర్తి ఛార్జింగ్, ఫుల్‌ పెట్రోల్‌ ట్యాంక్‌తో ఈ కారు ఏకంగా 1,200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. రోజూ సిటీలో 50 కిలోమీటర్లు తిరిగే వారు, ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఛార్జ్‌ చేసుకుంటే నెలల తరబడి పెట్రోల్‌ అవసరం లేకుండా కేవలం ఈవీ మోడ్‌లోనే దీనిని నడపవచ్చు’’ అని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వెహిక ల్స్‌ బిజినెస్‌ హెడ్‌ రాజీవ్‌ చౌహాన్‌ తెలిపారు. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చాలా మెరుగైందన్నారు. కేవలం హైవేలపై మాత్రమే ప్రణాళిక అవసరమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement