హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో మూడు రోజుల పాటు జరిగే బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026ను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో కలిసి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. జూలై 14 నుంచి 16 వరకు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా 14 దేశాల నుంచి 110 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.
ప్రస్తుత కాలంలో ఏఐ, ఆటోమేషన్ వంటి సాంకేతిక మార్పులతో కార్మిక రంగం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని మంత్రి వివేక్ తెలిపారు. ఈ నేపథ్యంలో కార్మికులకు సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, నిరంతర శిక్షణ అందించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కార్మికుల భద్రత, హక్కుల పరిరక్షణతోనే పరిశ్రమల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
ఈ సదస్సులో భవిష్యత్ ఉద్యోగాలు, స్కిల్ డెవలప్‌మెంట్, కార్మిక హక్కులు, సామాజిక భద్రత, ట్రేడ్ యూనియన్ల బలోపేతం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. వివిధ దేశాల్లో అమలవుతున్న ఉత్తమ కార్మిక విధానాలను అధ్యయనం చేసి, భవిష్యత్ కార్యాచరణకు సిఫార్సులు రూపొందించడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా యువతకు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతోందని మంత్రి చెప్పారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు ఆధునిక శిక్షణ అందిస్తున్నామని, టామ్‌కామ్ ద్వారా జర్మనీ, జపాన్, యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. ఈ సదస్సుకు భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆతిథ్యం ఇస్తోంది.


