
కర్ణాటక హైకోర్టు బెంగళూరులో బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధాన్ని ఎత్తివేసింది. దాంతో రాపిడో, ఉబర్, ఓలా వంటి ఆన్‌లైన్ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌లు రాష్ట్రంలో తమ బైక్ ట్యాక్సీ సేవలను తిరిగి ప్రారంభించాయి. నెలరోజుల్లోగా బైక్ ట్యాక్సీ పాలసీని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కర్ణాటకలో, ముఖ్యంగా బెంగళూరులో బైక్ ట్యాక్సీ సేవలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉబర్, ఓలా, రాపిడో వంటి ఆన్‌లైన్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లు అందించే బైక్ ట్యాక్సీపై నిషేధం విధిస్తూ 2025 జూన్ 16న రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. మోటారు వాహన చట్టం 1988 ప్రకారం బైక్ ట్యాక్సీ సేవలు చట్టవిరుద్ధమని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులను రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌లు సవాలు చేశాయి.
నిషేధాన్ని ఎత్తివేసిన కోర్టు
రాపిడో, ఓలా, ఉబర్ సంస్థల అప్పీలును జస్టిస్ విభూ బఖ్రూ, జస్టిస్ సీఎం జోషిలతో కూడిన ధర్మాసనం విచారించింది. బైక్ ట్యాక్సీలు చట్టబద్ధమైన వ్యాపారమని, వీటిపై నిషేధం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. బైక్ ట్యాక్సీలపై నిషేధం ఏకపక్షం, అసమంజసం, ఆర్టికల్ 14, 19(1)(జి)లను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. బైక్ ట్యాక్సీ పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వానికి నెల రోజులు గడువు ఇచ్చింది.
బైక్ ట్యాక్సీల అవసరం
టెక్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరులో రోడ్డు మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అంతే కాదు, ప్రజా రవాణా వసతులు ఆశించినమేరకు లేకపోవడం వల్ల ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడం సవాలుగా మారుతుంది. ఇలాంటి సమయంలో బైక్ ట్యాక్సీ సర్వీసులు ఎంతో ఉపయోగపడుతున్నాయనే వాదనలున్నాయి. ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. అభివృద్ధి చెందుతున్న చాలా నగరాలకు బైక్ సర్వీసులు అవసరం అవుతున్నట్లు కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఇవాళ, రేపు హెచ్‌డీఎఫ్‌సీ సర్వీసుల్లో అంతరాయం