
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు సంబంధించిన కొన్ని సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుంది. వాట్సాప్ ద్వారా చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ వంటి ఫీచర్లు ఆగస్టు 22, 23 తేదీల్లో స్వల్ప కాలానికి అందుబాటులో ఉండవని బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో బ్యాంక్ కస్టమర్ కేర్ సేవలకు కూడా అంతరాయం కలగనుంది.
ఖాతాదారులకు మొత్తం బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వ్యవస్థల నిర్వహణను చేపడుతున్నందున ఈ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. "మీ బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, ఆగస్టు 22 రాత్రి 11:00 గంటల నుండి ఆగస్టు 23 ఉదయం 6:00 గంటల వరకు అవసరమైన సిస్టమ్ మెయింటెనెన్స్ నిర్వహిస్తున్నాం" అని బ్యాంక్ ఒక నోటీసులో తెలిపింది.
దీంతో కొన్ని బ్యాంకింగ్ సేవలు ఏడు గంటల పాటు అందుబాటులో ఉండవు. ఈ కాలంలో కస్టమర్ కేర్ సేవలు (ఫోన్ బ్యాంకింగ్ ఐవీఆర్, ఈమెయిల్ & సోషల్ మీడియా), వాట్సాప్‌లో చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అందుబాటులో ఉండవని బ్యాంక్ వెల్లడించింది.
మెయింటెనెన్స్ పీరియడ్ లో ఫోన్ బ్యాంకింగ్ ఏజెంట్ సేవలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పేజాప్, మై కార్డ్స్ సేవలు మాత్రం యథావిధిగా అందుబాటులో ఉంటాయని ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం వివరించింది.