టెక్నాలజీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో ఓ ఐటీ దంపతులు నిర్మించుకున్న ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విశేష ఆకర్షణగా మారింది. అత్యాధునిక జీవనశైలికి అలవాటు పడిన ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దంపతులు, తమ పూర్వీకుల జ్ఞాపకాలను ఆధునిక అవసరాలతో మేళవిస్తూ నిర్మించిన ఈ నివాసం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంటికి సంబంధించిన వీడియోను డిజైన్ సంస్థ ఆర్చ్‌ప్రో (ArchPro) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
అందులోని వివరాల ప్రకారం.. వేగవంతమైన కార్పొరేట్ జీవితానికి పూర్తి భిన్నంగా ప్రశాంతమైన, సంప్రదాయ విలువలతో కూడిన వాతావరణంలో జీవించాలని ఈ దంపతులు కోరుకున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచే ఎక్కువసేపు పనిచేస్తున్న (వర్క్ ఫ్రమ్ హోమ్) ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక ప్రశాంతతను కలిగించేలా, పాతకాలపు దక్షిణ భారత గృహ నిర్మాణ శైలిని ఆధునిక సౌకర్యాలతో మిళితం చేయాలని నిర్ణయించుకున్నారు. అదే ఈ ఇంటి రూపకల్పనకు ప్రధాన ఆలోచనగా నిలిచిందని డిజైనర్లు తెలిపారు.
సుమారు 4,382 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇల్లు 2025లో పూర్తైంది. ఇంటి ప్రధాన ఆకర్షణ మధ్యలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ ప్రాంగణం (కోర్ట్‌యార్డ్). అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం మాత్రం 130 ఏళ్ల నాటి చెక్క స్తంభాలు. ఈ స్తంభాలను దంపతుల పూర్వీకుల ఇంటి నుంచి జాగ్రత్తగా భద్రపరచి కొత్త ఇంటిలో వినియోగించారు. కొత్త మంగళూరు టైల్స్ పైకప్పునకు సరిపోయేలా ఈ పురాతన స్తంభాలను అమర్చడం డిజైన్ బృందానికి సవాలుగా మారినప్పటికీ, వాటి అసలు రూపానికి ఎలాంటి నష్టం కలగకుండా పనులు పూర్తి చేశారు.
ఇంటి నిర్మాణంలో సహజమైన వస్తువుల వాడకానికి పెద్దపీట వేశారు. ఇటుకలు బయటకు కనిపించేలా గోడలు, మట్టి రంగు ఫ్లోరింగ్, చెక్కతో చేసిన తలుపులు, పెద్ద కిటికీలు, ఎత్తైన పైకప్పులు, సంప్రదాయ ఉయ్యాల వంటి అంశాలు ఇంటికి ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. మధ్యలోని ప్రాంగణం ద్వారా సహజ కాంతి, గాలి సమృద్ధిగా ప్రవేశించేలా రూపకల్పన చేయడంతో ఇల్లంతా ప్రశాంత వాతావరణం పరచుకుంటుంది. బయట ప్రకృతి, లోపలి జీవనశైలి మధ్య సహజ అనుసంధానం కల్పించేలా వరండా, ప్రవేశ ద్వారాన్ని రూపొందించారు.
బెంగళూరు వంటి నగరాల్లో ఇటీవలి కాలంలో సంప్రదాయ శైలిని ఆధునిక నిర్మాణంతో కలిపే "హెరిటేజ్-ఇన్‌స్పైర్డ్ హోమ్స్"పై ఆసక్తి పెరుగుతోంది. పాతకాలపు నిర్మాణ సామగ్రిని తిరిగి వినియోగించడం, సహజ కాంతి, గాలి, పర్యావరణహిత పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి ధోరణులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ ఇంటి రూపకల్పన కూడా అలాంటి మారుతున్న నిర్మాణ ధోరణులకు ప్రతీకగా నిలుస్తోంది.


