
అభివృద్ధి చెందిన నగరాల్లో ట్రాఫిక్ అనేది వాహన వినియోగదారులకు అతిపెద్ద సమస్యగా మారిపోయింది. దీనిని పరిష్కరించే దిశలోనే జపాన్ విమానయాన సంస్థ 'ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్' (ANA) అడుగులు వేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ (ANA) కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ జాబీ ఏవియేషన్‌తో భాగస్వామ్యం ద్వారా జపాన్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు కంపెనీలు ఒక జాయింట్ వెంచర్‌ను స్థాపించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. దీని ద్వారా 100కి పైగా ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) ట్యాక్సీలను మోహరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2027 నాటికి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి.
జపాన్ కంపెనీ తయారు చేయనున్న.. ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఐదు సీట్లను కలిగి ఉంటాయి. ఇందులో ఒక పైలట్, నలుగురు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించగలరు. ఇది గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఈ తరహా ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చిన తరువాత నరిటా, హనేడా విమానాశ్రయాలు - సెంట్రల్ టోక్యో మధ్య ప్రయాణించడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ వెల్లడించింది.
ఇదీ చదవండి: 75 దేశాల్లో కోటి మంది కొన్నారు: ధర కూడా తక్కువే..
ఎయిర్ టాక్సీల ధరలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కాగా సంస్థ తన మొదటి ఎయిర్ టాక్సీని అక్టోబర్ 2025లో జరిగే ఒసాకా ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఇవి తక్కువ శబ్దంతో.. వినియోగంలో లేనప్పుడు జీరో ఉద్గారాలను ఉత్పత్తి చేసేలా కంపెనీ నిర్మించనుంది.