
సుజుకి మోటార్ కార్పొరేషన్.. 'వ్యాగన్ ఆర్' ప్రపంచవ్యాప్తంగా 1 కోటి అమ్మకాలు దాటిందని ప్రకటించింది. ఈ కారు 1999లో భారతదేశంలో అడుగుపెట్టడానికి ముందే.. జపాన్, యూరప్ వంటి మార్కెట్లలో మంచి అమ్మకాలను పొందింది.
1993 సెప్టెంబర్‌లో జపాన్‌లో వ్యాగన్ ఆర్ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రారంభంలో ఇది సెమీ బోనెట్ స్టైల్ పొందింది. దీని పరిమాణం, డిజైన్ కారణంగానే అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది. జపాన్ తరువాత భారతదేశం (1999), హంగేరీ (2000), ఇండోనేషియా (2013), పాకిస్తాన్ (2014)లలో వ్యాగన్ ఆర్ ఉత్పత్తి మొదలైంది. ప్రస్తుతం ఈ కారును కంపెనీ సుమారు 75 కంటే ఎక్కువ దేశాల్లో విక్రయిస్తోంది.
1998 అక్టోబర్ నాటికి 10 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్న వ్యాగన్ ఆర్.. 2010 ఫిబ్రవరి నాటికి 50 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది. 2022 జనవరి నాటికి 90 లక్షలు, 2025 జూన్ నాటికి ఒక కోటి యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకోగలిగింది.
ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్స్: రూ.10 లక్షల తగ్గింపు!
భారతదేశంలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 1.0 లీటర్, త్రీ సిలిండర్, 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో మాత్రమే కాకుండా.. CNG ఎంపికలో కూడా లభిస్తోంది. ఈ కారు ధరలు రూ. 5.78 లక్షల నుంచి ప్రారంభమై రూ. 7.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.