ఏఐ బూమ్‌తో ఎగుమతులు అప్‌! | AI Boom Powers China's Export Surge Growth in June | Sakshi
Sakshi News home page

ఏఐ బూమ్‌తో ఎగుమతులు అప్‌!

Jul 14 2026 12:17 PM | Updated on Jul 14 2026 12:20 PM

AI Boom Powers China's Export Surge Growth in June

ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం చైనా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది జూన్ నెలలో చైనా ఎగుమతులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 27 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ మేరకు చైనా కస్టమ్స్ శాఖ అధికారిక గణాంకాలను విడుదల చేసింది. ఆర్థికవేత్తల ముందస్తు అంచనాలను తలకిందులు చేస్తూ నమోదైన ఈ రికార్డు వృద్ధి, చైనా ఎగుమతి రంగానికి బలమైన మైలేజీని ఇచ్చింది. గడిచిన మే నెలలో నమోదైన 19.4 శాతం వార్షిక వృద్ధితో పోలిస్తే జూన్ ఫలితాలు మరింత మెరుగ్గా ఉండటం గమనార్హం.

ఏఐ సాంకేతికత, ఈవీలదే హవా

గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్‌మెంట్ సైకిల్ చైనా హైటెక్ ఉత్పాదక రంగానికి భారీగా కలిసివచ్చింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ మోడల్స్ విస్తృతి పెరగడంతో అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు కంప్యూటర్లు, ఆటోమేటెడ్ డేటా ప్రాసెసింగ్ పరికరాలు, హైటెక్ ఎలక్ట్రానిక్ పరికరాల ఎగుమతులు వృద్ధి చెందాయి. అలాగే, చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు కూడా గ్లోబల్ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అమెరికా టారిఫ్‌ల భయంతో పశ్చిమ దేశాల వ్యాపారులు భారీగా ఆర్డర్లు ఇవ్వడం కూడా ఈ అసాధారణ వృద్ధికి మరో ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

దేశీయ మందగమనానికి విదేశీ ఊరట

ప్రస్తుతం చైనా దేశీయంగా రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర సంక్షోభాన్ని, వినియోగదారుల ఖర్చుల్లో మందగమనాన్ని ఎదుర్కొంటోంది. స్థానిక మార్కెట్‌లో నెలకొన్న ఈ బలహీనతలను విదేశీ ఎగుమతుల జోరు సమర్థవంతంగా భర్తీ చేస్తోంది. అయితే, ఈ వృద్ధి సుస్థిరంగా కొనసాగడంపై ఆర్థిక నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రస్తుతానికి ఎగుమతుల వృద్ధి బాగున్నప్పటికీ భవిష్యత్తులో ఇది మరింత సున్నితంగా మారే అవకాశం ఉంది. ఆటోమొబైల్స్, ఏఐ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులు పూర్తిగా అంతర్జాతీయ డిమాండ్, పశ్చిమ దేశాల నియంత్రణలపైనే ఆధారపడి ఉంటాయి’ బీఎన్‌పీ పారిబాస్ సెక్యూరిటీస్ (చైనా) మల్టీ-అస్సెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ హెడ్ వేయ్ లీ అన్నారు.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement