రూ. 14,535 కోట్ల ప్రతిపాదనకు రుణదాతల కమిటీ ఆమోదం
న్యూఢిల్లీ: జేపీ అసోసియేట్స్‌ను (జేఏఎల్) టేకోవర్ చేసేందుకు అదానీ గ్రూప్‌నకు మార్గం సుగమం అయింది. కంపెనీ కొనుగోలుకు వచ్చిన ప్రతిపాదనల్లో అదానీ గ్రూప్ సమర్పించిన రూ. 14,535 కోట్ల పరిష్కార ప్రణాళికకు రుణదాతల కమిటీలోని (సీవోసీ) మెజారిటీ రుణదాతలు ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి నిర్వహించిన ఓటింగ్‌లో అదానీ గ్రూప్‌కి అత్యధికంగా 89 శాతం ఓట్లు రాగా, దాల్మియా సిమెంట్ (భారత్), వేదాంత గ్రూప్ ఆ తర్వాత స్థానాల్లో నిల్చినట్లు వివరించాయి.
అదానీ గ్రూప్ ముందుగా రూ. 6,005 కోట్లు, తర్వాత రెండేళ్ల వ్యవధిలో మరో రూ. 7,600 కోట్లు చెల్లించేలా ప్రతిపాదన చేసింది. మిగతా వాటితో పోలిస్తే అదానీ గ్రూప్ ముందుగా చెల్లించే మొత్తం ఎక్కువగా ఉండటం, పైగా తక్కువ వ్యవధిలోనే పూర్తిగా చెల్లించేలా ఉండటంతో సీవోసీ దాని వైపు మొగ్గు చూపింది. వేదాంత గ్రూప్ మొత్తం రూ. 16,726 కోట్లు (ముందుగా రూ. 3,800 కోట్లు, అయిదేళ్ల వ్యవధిలో రూ. 12,400 కోట్లు) ఆఫర్ చేసింది.
సీవోసీలో నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి (ఎన్‌ఏఆర్‌సీఎల్) అత్యధికంగా 86 శాతం ఓటింగ్ షేరు ఉంది. మూడు శాతంలోపే వాటా ఉన్న ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర రుణదాతలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. రియల్ ఎస్టేట్, సిమెంట్ తయారీ, ఆతిథ్యం తదితర రంగాల్లో కార్యకలాపాలున్న జేఏఎల్ రూ. 57,185 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలం కావడంతో కంపెనీపై గతేడాది దివాలా ప్రక్రియ కింద చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కంపెనీని వేలానికి ఉంచగా, ముందు 25 కంపెనీలు ఆసక్తి చూపాయి. తర్వాత అయిదు కంపెనీల నుంచి బిడ్లు, ధరావతు వచ్చినట్లు జేఏఎల్ ప్రకటించింది.
విల్మర్‌కు అదానీ షేర్ల విక్రయం
ఏడబ్ల్యూఎల్ అగ్రిలో 13 శాతం వాటా అమ్మకం
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్(గతంలో అదానీ విల్మర్)లో 13 శాతం వాటాను విల్మర్ ఇంటర్నేషనల్‌కు విక్రయించింది. ఆఫ్‌మార్కెట్ లావాదేవీల ద్వారా అదానీ కమోడిటీస్ ఎల్‌ఎల్‌పీ(ఏసీఎల్) 13 శాతం వాటాకు సమానమైన 16.9 కోట్ల షేర్లను విల్మర్ అనుబంధ సంస్థ లెన్స్ పీటీఈకి అమ్మివేసింది. ఈ ఏడాది మొదట్లో ప్రకటించిన వాటా విక్రయ ప్రణాళికలో భాగంగా విల్మర్‌కు 13 శాతం అదనపు వాటాను విక్రయించింది. షేరుకి రూ. 275 ధరలో ఏడబ్ల్యూఎల్‌లో 11–20 శాతం మధ్య వాటా కొనుగోలు చేసేందుకు విల్మర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
కాగా.. గత వారం ఈ అంశాన్ని లెన్స్ పీటీఈ సైతం ప్రకటించింది. వెరసి అనుబంధ సంస్థ ఏసీఎల్ ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్ వాటా విక్రయానికి తెరతీసింది. వాటా కనీస విలువ రూ. 4,646 కోట్లుగా అంచనా. తాజా విక్రయం తదుపరి ఏడబ్ల్యూఎల్ అగ్రిలో ఏసీఎల్ వాటా 20 శాతం నుంచి 7 శాతానికి దిగివచ్చింది. మరోపక్క ఏడబ్ల్యూఎల్ అగ్రిలో లెన్స్ వాటా 56.94 శాతానికి బలపడింది. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్‌లో 20 శాతం వాటా విక్రయించనున్నట్లు 2025 జూలైలో అదానీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విల్మర్ ఇంటర్నేషనల్(సింగపూర్)కు రూ. 7,150 కోట్ల విలువతో అమ్మివేయనున్నట్లు తెలియజేసింది.
బీఎస్‌ఈలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 0.2% నీరసించి రూ. 2,431 వద్ద ముగిసింది.


