దేశీ గగనతలంపై త్వరలో కొత్త ఎయిర్‌లైన్స్ రెక్కలు విప్పుకోనున్నాయి. ఇటీవలే ఇండిగో సంక్షోభంతో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం.. ఈ రంగంలో పోటీని పెంచేందుకు వీలుగా రెండు కొత్త సంస్థల కార్యకలాపాలకు పచ్చజెండా ఊపింది.
కేరళకు చెందిన అల్‌హింద్ గ్రూప్ కంపెనీ అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థలకు పౌర విమానయాన శాఖ నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) మంజూరు చేసింది. మరోవైపు ఇప్పటికే ఎన్‌వోసీని సొంతం చేసుకున్న శంఖ్‌ఎయిర్ సైతం 2026 మొదటి త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు బుధవారం ప్రకటించింది.
వచ్చే రెండు మూడేళ్లలో 20–25 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు తమ సామర్థ్యాలను పెంచుకుంటామని సంస్థ చైర్మన్, ఎండీ శర్వణ్‌కుమార్ విశ్వకర్మ కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడుతో భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. దేశీయంగా 9 విమానయాన సంస్థలు సేవలు అందిస్తుండగా, ఇండిగో, ఎయిర్‌ఇండియా 90 శాతం వాటా కలిగి ఉన్నాయి.
ఇప్పటికే ఎన్‌వోసీ పొందిన సంస్థలు తదుపరి దశలో ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (ఏఓసీ) కోసం డీజీసీఏ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భద్రతా ప్రమాణాలు, పైలట్లు–సిబ్బంది శిక్షణ, విమానాల సమీకరణ, నిర్వహణ వ్యవస్థలపై కఠిన పరిశీలన జరుగుతుంది. అనుమతులు పూర్తయిన తర్వాత దేశీయ రూట్లతో పాటు మధ్యప్రాచ్యం, దక్షిణాసియా వంటి ప్రాంతాలకు అంతర్జాతీయ సేవలపై కూడా ఈ సంస్థలు దృష్టి పెట్టే అవకాశముంది. ముఖ్యంగా కేరళ కేంద్రంగా పనిచేసే సంస్థలు గల్ఫ్ దేశాలకు ప్రయాణికుల డిమాండ్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
కొత్త ఎయిర్‌లైన్స్ రాకతో టికెట్ ధరల్లో పోటీ పెరిగి ప్రయాణికులకు మరిన్ని ఎంపికలు లభించనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అలాగే చిన్న నగరాలు, టైర్-2, టైర్-3 పట్టణాలకు కనెక్టివిటీ మెరుగుపడే అవకాశం ఉంది. ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్న ప్రాంతీయ విమానయాన పథకాలకు కూడా ఇవి తోడ్పడతాయని అంచనా. అదే సమయంలో ఇంధన ధరలు, విమానాల లీజింగ్ ఖర్చులు, నైపుణ్య సిబ్బంది కొరత వంటి సవాళ్లను కొత్త సంస్థలు ఎలా ఎదుర్కొంటాయన్నది ఆసక్తికరంగా మారింది.


