ఐటీలో తాత్కాలిక ఉద్యోగులు ఐదేళ్లలో డబుల్‌!  | 12 to 15 percent of IT professionals prefer temporary roles | Sakshi
Sakshi News home page

ఐటీలో తాత్కాలిక ఉద్యోగులు ఐదేళ్లలో డబుల్‌! 

Jun 19 2025 4:24 AM | Updated on Jun 19 2025 7:59 AM

12 to 15 percent of IT professionals prefer temporary roles

2030 నాటికి 9 లక్షలకు ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌ 

ప్రస్తుతం వీరి సంఖ్య 3,90,000 

సిబ్బంది నిర్వహణలో స్పష్టమైన మార్పు

ముంబై: ఐటీ, ఐటీఈఎస్‌ రంగంలో తాత్కాలిక ఉద్యోగులకు (ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌) డిమాండ్‌ క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో 3,90,000 మంది ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌ ఉండగా.. వీరి సంఖ్య 2030 నాటికి 9 లక్షలకు చేరుకుంటుందని కెరీర్‌నెట్‌ నివేదిక వెల్లడించింది. ఏటా వీరి సంఖ్య 15 శాతం చొప్పున పెరగనుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఐటీ రంగం 58 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తుంటే.. వీరిలో 7 శాతం మేర తాత్కాలిక ఉద్యోగులే ఉన్నట్టు తెలుస్తోంది. 

ఐటీ రంగంలో పెరుగుతున్న ఫ్లెక్సీ స్టాఫింగ్‌ పేరుతో కెరీర్‌నెట్‌ ఒక నివేదిక విడుదల చేసింది. నియామకాల డేటా, మార్కెట్‌ పరిశోధన, పరిశ్రమలో ధోరణులను విశ్లేíÙంచి ఈ వివరాలు ప్రకటించింది. ‘భారత్‌ ప్రపంచ ఆఫ్‌షోర్‌ హబ్‌గా మారుతోంది. కనుక ఐటీ, ఐటీఈఎస్‌ రంగంలో ఫ్లెక్సీ వర్కర్లకు డిమాండ్‌ పెరగనుంది. డిజిటల్‌ టెక్నాలజీలకు మళ్లడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పుల నేపథ్యంలో వేగం, ప్రత్యేకత, విస్తరణ అవసరాలకు మద్దతుగా ఫ్లెక్సీ స్టాఫింగ్‌ నమూనాను కంపెనీలు అనుసరిస్తున్నాయి’ అని  కెరీర్‌నెట్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ నీలబ్‌ శుక్లా తెలిపారు.

కెరీర్‌లో పురోగతికి దారి..  నిపుణులకు వృత్తిలో ఎదుగుదల, నైపుణ్యాల అభివృద్ధి, పని–వ్యక్తిగత జీవితం మధ్య మెరుగైన సమతుల్యాన్ని ఫ్లెక్సీ ఉద్యోగాలు ఆఫర్‌ చేస్తున్నాయని చెబుతూ.. మిలీనియల్స్, జెనరేషన్‌ జెడ్‌ నిపుణులకు ఇవి కీలక ప్రాధాన్యతలుగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ఐటీ/ఐటీఈఎస్‌ రంగంలో ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌కు బెంగళూరు ప్రముఖ కేంద్రంగా ఉంది. ఈ రంగంలోని మొత్తం తాత్కాలిక సిబ్బందిలో 25 శాతం మంది ఈ నగరంలోనే ఉపాధి పొందుతున్నారు. 

ఆ తర్వాత హైదరాబాద్‌ 15 శాతం మంది ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌కు ఉపాధి కలి్పస్తోంది. ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, పుణే, చెన్నై ఒక్కోటీ 10 శాతం మేర తాత్కాలిక ఉద్యోగులకు ఉపాధి కేంద్రాలుగా ఉన్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ తాత్కాలిక ఉద్యోగుల సిబ్బందిలో వృద్ధి నమోదవుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఐటీ/ఐటీఈఎస్‌ రంగంలోని ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం మేర ఈ నగరాల నుంచే ఉన్నట్టు వెల్లడించింది. నిపుణుల లభ్యతకు, తక్కువ వ్యయాలతో కూడిన వ్యాపార నమూనాలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement