రైలే లేదు | - | Sakshi
Sakshi News home page

రైలే లేదు

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

ఎంపీలు దృష్టి సారించాలని..

మూడేళ్ల క్రితం కొత్తగూడెం–సత్తుపల్లి లైన్‌ అందుబాటులోకి

బొగ్గు రవాణాతో సింగరేణి నుంచి

ఏటా రూ.200 కోట్ల ఆదాయం

ప్రయాణికుల రైలు ఏర్పాటును

మాత్రం పట్టించుకోని రైల్వేశాఖ

ఎంపీలు చొరవ చూపాలని కోరుతున్న ఉమ్మడి జిల్లావాసులు

లైన్‌ ఉంది..

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం రోడ్‌ (కొత్తగూడెం)–సత్తుపల్లి రైలు మార్గం అందుబాటులోకి వచ్చి మూడేళ్లు గడిచింది. అయినా ప్రయాణికులకు రైలు సౌకర్యం కల్పించలేదు. భద్రాచలంరోడ్‌–కొవ్వూరు రైల్వేలైన్‌లో భాగంగా పరిగణిస్తున్న సత్తుపల్లి–భద్రాచలం రోడ్డు లైన్‌లో గూడ్స్‌ రైళ్ల ద్వారా బొగ్గు రవాణాకు 2022, మే 28 నుంచి అనుమతి వచ్చింది. అదే ఏడాది నవంబరులో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా వర్చువల్‌ పద్ధతిలో లైన్‌ను ప్రారంభించారు. కొత్తగా 54 కి.మీ నిడివి కలిగిన ఎలక్ట్రిక్‌ సింగిల్‌ లైన్‌ను రూ. 928 కోట్లతో నిర్మించారు. ఇందులో రూ.619 కోట్లు సింగరేణి సమకూర్చింది. మూడేళ్లుగా సింగరేణి సంస్థ ఈ మార్గంలో 30 వేల టన్నుల బొగ్గు రవా ణా చేస్తోంది. ఫలితంగా రైల్వేకు ఏటా రూ.200 కోట్ల ఆదాయం లభిస్తోంది.

సింగరేణి, రైల్వే ప్రయోజనం పొందుతున్నా..

రైలు మార్గంలో కొత్తగా సర్వారం, చండ్రుగొండ, పార్థసారథిపురం స్టేషన్లు నిర్మించారు. చివరిదైన సత్తుపల్లి టెర్మినల్‌ దగ్గర ప్రయాణికుల కోసం స్టేషన్‌ నిర్మించకుండా కేవలం కోల్‌ ట్రాన్స్‌పోర్టుకు అనుగుణంగానే లైన్‌ ముగించారు. దీంతో ప్యాసింజర్‌ రైలు నడిపించే విషయాన్ని రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండే భారీ పరిశ్రమలకు సరుకు రవాణా చేసే మార్గంగానే పరిగణిస్తోంది. వెనుకబడిన గిరిజన ప్రాంతాల మీదుగా వెళ్లే లైన్‌ ద్వారా కనెక్టివిటీ పెంచడంపై దృష్టి సారించడం లేదు. ఈ లైన్‌ ద్వారా సింగరేణి, రైల్వే శాఖ ప్రయోజనం పొందుతున్నా స్థానిక ఏజెన్సీవాసులకు కలిగిన ఉపయోగంలేకుండా పోయింది.

కనీస ప్రయత్నాలు లేవు

నిబంధనల ప్రకారం కొత్త లైనులో కొన్నాళ్ల పాటు గూడ్స్‌ రైళ్లు నడిచాక ప్యాసింజర్‌ రైళ్లు నడిపే ప్రక్రి య మొదలవుతుంది. కొత్తగూడెం–సత్తుపల్లి ట్రాక్‌ పై కూడా ప్యాసింజర్‌ రైళ్లను కొంతకాలంపాటు ప్రయోగాత్మకంగా నడిపించాల్సి ఉంది. ప్యాసింజర్‌ రైళ్లు ఎన్ని బోగీలతో, ఎంత వేగంతో నడపవచ్చు, వేగం ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలనే అంశాలను పరిశీలిస్తారు. ట్రాక్‌ అనువుగా ఉందని భావించాక సేఫ్టీ సర్టిఫికెట్‌ కోసం రైల్వే బోర్డుకు దరఖాస్తు చేస్తారు. అనుమతులు రాగానే ప్రయాణికుల రైళ్లు పట్టాలెక్కుతాయి. కానీ ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లు నడిపించేందుకు సేఫ్టీ సర్టిఫికెట్‌ కోసం ప్రయత్నాలు చేయడంలేదు. ఫలితంగా కొత్త రైల్వే స్టేషన్లు అలంకారప్రాయంగా మారాయి.

రైల్వే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో ప్యాసింజర్‌ రైలు నడిపించే బాధ్యత ఎక్కువగా ఎంపీల మీదే ఆధారపడి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంపీలుగా వద్దిరాజు రవి చంద్ర, రామసహాయం రఘురాంరెడ్డి, బండి పార్థసారధిరెడ్డిలు ఉన్నారు. ఇటీవల వీరంతా జిల్లాకు సంబంధించిన భద్రాచలం రోడ్‌కు డివిజన్‌ హోదా, కొత్తగూడెంలో రోడ్డు విస్తరణ, డోర్నకల్‌ –మిర్యాలగూడ లైన్‌ అలైన్‌మెంట్‌ మార్పు తదితర అంశాలను రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్తున్నారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు రైల్వేబోర్డులోని ఉన్నతాధికారులను కలుస్తున్నారు. ఇదే చొరవను కొత్తగూడెం–సత్తుపల్లి లైన్‌లో ప్యాసింజర్‌ రైలు నడిపించడంపై కూడా చూపాలని ఉమ్మడి జిల్లా వాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement