స్మార్ట్‌గా అంగన్వాడీ సేవలు | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌గా అంగన్వాడీ సేవలు

Apr 11 2026 8:34 AM | Updated on Apr 11 2026 8:34 AM

● అంగన్వాడీ సిబ్బందికి 4జీ ఫోన్లు ● ఇక ఆన్‌లైన్‌ సేవలు వేగవంతం ● జిల్లాలో రూ.2.25 కోట్ల విలువైన 1,954 మొబైళ్ల అందజేత సద్వినియోగం చేసుకోవాలి నెలకోసారి ఎస్‌ఆర్‌ఎస్‌ నమోదు..

● అంగన్వాడీ సిబ్బందికి 4జీ ఫోన్లు ● ఇక ఆన్‌లైన్‌ సేవలు వేగవంతం ● జిల్లాలో రూ.2.25 కోట్ల విలువైన 1,954 మొబైళ్ల అందజేత

భద్రాచలంఅర్బన్‌: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత ‘స్మార్ట్‌’గా మారనుంది. క్షేత్రస్థాయిలో మాతాశిశు సంరక్షణ కోసం శ్రమిస్తున్న కార్యకర్తల సేవలను వేగవంతం చేసేందుకు ప్రభు త్వం నడుం బిగించింది. కొన్నేళ్లుగా పాతతరం ఫోన్లు, సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్న సిబ్బందికి నూతన స్మార్ట్‌ఫోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కలెక్టరేట్‌లో శుక్రవారం సిబ్బందికి ఫోన్లు పంపిణీ చేశారు.

1,954 మందికి స్మార్ట్‌ఫోన్లు

భద్రాద్రి జిల్లాలోని 22 మండలాల పరిధిలోగల 11 ప్రాజెక్ట్‌లు, 84 సెక్టార్ల పరిధిలో మొత్తం 2,061 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా మూడేళ్లలోపు వారు 28,802 మంది, 3–6 ఏళ్ల లోపు వారు 23,834 మంది లబ్ధి పొందుతున్నారు. వీరితో పాటు 5,586 మంది బాలింతలు, 5,978 మంది గర్భిణులకు సేవలు అందుతున్నాయి. 2021లో అంగన్వాడీ కార్యకర్తలకు 2జీ సాంకేతికత కలిగిన ఫోన్లను అందించారు. లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ‘పోషణ్‌ ట్రాకర్‌’ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాత ఫోన్లలో సర్వర్‌ సమస్యలు, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కాకపోవడం, డిస్‌ప్లే పగిలిపోవడంతో అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రుల ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్‌) నమోదులో తీవ్ర జాప్యం జరిగేది. ఆర్థిక స్తోమత ఉన్న కొందరు కార్యకర్తలు సొంతంగా 4జీ ఫోన్లు కొనుగోలు చేసుకున్నారు. మరికొందరు పాత ఫోన్లతోనే కుస్తీ పడుతూ రికార్డుల నమోదులో వెనుకబడ్డారు.

మంత్రి చేతులమీదుగా..

జిల్లాలో మొత్తం 1,866 అంగన్వాడీ కార్యకర్తలు ఉండగా 73 మంది సూపర్‌వైజర్లతోపాటు బ్లాక్‌ కోఆర్డినేటర్లతో కలిపి మొత్తం 1,954 స్మార్ట్‌ఫోన్లను రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఐడీఓసీలో పంపిణీ చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 195 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు, 7 మంది సూపర్‌వైజర్‌పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

సేవలు ఇలా..

ప్రతీరోజు యాప్‌లో లబ్ధిదారులకు అందించే 14 రకాల వస్తువుల వివరాలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పంపిణీ చేసే పౌష్టికాహార వివరాలు నమోదు చేయాలి. చిన్నారులకు బోధించే పాఠాలు, వైద్య పరీక్షల సమాచారం, కమ్యూనిటీ బేస్డ్‌ ఈవెంట్స్‌, పోషణ్‌ దివస్‌, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, కమ్యూనిటీ హెల్త్‌, న్యూట్రిషియన్‌ సెషన్‌ వంటి కార్యక్రమాల వివరాలు, అంగన్వాడీ కేంద్రాల స్థితిగతులు, తాగునీరు, విద్యుత్‌, మరుగు దొడ్ల సౌకర్యాలు, మరమ్మతుల వివరాలను నమో దు చేయాలి.

గతంలో పాత ఫోన్లతో అంగన్వాడీ సిబ్బంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అందింస్తున్న స్మార్ట్‌ ఫోన్ల ద్వారా 14 రిజిస్టర్ల వివరాలను యాప్‌లలో సకాలంలో నమోదు చేయాలి. సొంత పనులకు ఈ ఫోన్‌లను వినియోగించొద్దు. జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలి. స్మార్ట్‌ ఫోన్‌లను అందరూ సద్వినియోగం చేసుకోవాలి.

–స్వర్ణలత లెనీనా, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారి

అంగన్వాడీ కేంద్రాల్లోని 3 నెలల నుంచి 6 ఏళ్ల వయస్సు గల చిన్నారులు, 14 నుంచి 18 ఏళ్ల కిశోర బాలికలకు ప్రతినెలా ఎస్‌ఆర్‌ఎస్‌ (ముఖ గుర్తింపు) హాజరు తీసుకుంటారు. దీనికోసం కొత్తఫోన్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. ప్రపంచం 5జీ వేగంతో దూసుకుపోతున్న తరుణంలో 4జీ ఫోన్లే ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తసెల్‌ టవర్లు 5జీ నెట్వర్క్‌ అందిస్తున్న వేళ 4జీ ఫోన్లతో భవిష్యత్‌లో మళ్లీ సమస్యలు వస్తాయని అభిప్రాయ పడుతున్నా రు. గతంలో అంగన్వాడీలకు 2 జీబీర్యామ్‌ సామర్థ్యం కలిగిన సెల్‌ఫోన్లు ఇవ్వడంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఈసారి 4 జీబీ ర్యామ్‌ సామర్థ్యం కలిగిన సెల్‌ఫోన్లు ఇస్తున్నారు. 12 జీబీ ర్యామ్‌ నడుస్తున్న తరుణంలో 4 జీబీ ర్యామ్‌ ఇవ్వడం సరికాదని, 6 జీబీ, అంతకంటే ఎక్కువ ఉండాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement