దమ్మపేట: జీవితంపై విరక్తితో యువకుడు పురుగులమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తాటిమల్లప్పగుంపు గ్రామానికి చెందిన అవివాహితుడు వాడే రాము (30) మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తితో ఈ నెల 3న మద్యంలో పురుగులమందును కలిపి తాగాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి వాడే రాజులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.
లచ్చాపురంలో మరో యువకుడు
పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. మండలంలోని లచ్చాపురం గ్రామానికి చెందిన అల్లం సాయిప్రసాద్(25) మద్యానికి బానిసగా మారి ఈ నెల 9న గుర్తుతెలియని పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. శుక్రవారం మృతిచెందాడు. మృతుడి సోదరి గంపా వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.
ఎలుకల మందు తాగిన మహిళ..
టేకులపల్లి: మండలంలోని దాసుతండాకు చెందిన బానోత్ జ్యోతి (45) మనస్తాపంతో ఎలుకలమందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఎస్‌ఐ రాజేందర్ కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ పూల్‌సింగ్‌పై ఈనెల 5న చేతి కర్ర విషయంలో అదేతండాకు చెందిన బానోత్ దేవిజ్యా, బానోత్ చిలికి, ఆమె కూతురు కొర్రా సునీత దాడిచేస్తుంటే ఆపడానికి వెళ్లిన జ్యోతిపై కూడా కర్రలతో దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో జ్యోతి మనస్తాపానికి గురై ఎలుకలమందు తాగి.. తన సోదరుడికి విషయం తెలిపింది. దీంతో కుటుంబీకులు ఆమెను ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. జ్యోతి తల్లి హంస్లీ ఫిర్యాదు మేరకు బానోత్ దేవిజ్యా, బానోత్ చిలికి, కొర్రా సునీతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాజేందర్ వెల్లడించారు.


