అమెరికా సామ్రాజ్యవాదానికి
● అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కోల్పోయిన భారత్ ● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రపంచ దేశాలపై ఆధిపత్యం, వనరుల దోపిడీకి అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై దాడులకు దిగగా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారానికి చైనా సాంకేతిక సహకారంతో ఇరాన్ గుణపాఠం చెప్పిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సీపీఎం జిల్లా స్థాయి ప్లీనంలో ఆయన మాట్లాడారు. ఇరాన్‌లో ప్రభుత్వాన్ని ఉంచాలా, దించాలా అన్నది అక్కడి పాలన ఆధారంగా ప్రజలే నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ పాలకులు తమకు పాదాక్రాంతం కాకపోతే దేశ నాగరికతనే నాశనం చేస్తామంటూ హిట్లర్ మాదిరి ట్రంప్ హెచ్చరించినా చైనా సాంకేతిక సహకారంతో ఇరాన్ ఎదురించిందని తెలిపారు. రాజకీయ సంకల్ప బలం, జాతీయవాదంతో వచ్చే ప్రేరణ, త్యాగనిరతి ఉన్న ప్రజల ముందు ఆయుధబలం ఓడిపోతుందని నాడు వియత్నాం, నేడు ఇరాన్ యుద్ధం నిరూపించిందన్నారు. కాగా, చైనా, రష్యా అండతో అమెరికా, ఇజ్రాయిల్ సామ్రాజ్యవాదంపై ఇరాన్ విజయం సాధిస్తే.. అమెరికా చెప్పింది చేసే అలవాటు ఉన్న మోదీ కారణంగా అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన ప్రాముఖ్యత కోల్పోయిందని తమ్మినేని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వరరావు, మాచర్ల భారతి, బండి రమేష్, వై విక్రమ్, బుగ్గవీటి సరళ, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, శ్రీనివాసరావు, బండి పద్మ, మెరుగు సత్యనారాయణ, మడుపల్లి గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.


