ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌.. ముగ్గురు యువకుల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌.. ముగ్గురు యువకుల దుర్మరణం

Sep 18 2023 1:12 AM | Updated on Sep 18 2023 12:18 PM

- - Sakshi

నాగులుప్పలపాడు/మేదరమెట్ల: వినాయక చవితికి గ్రామంలో ఏర్పాటు చేసే విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌ ఇచ్చి బైక్‌పై తిరిగి వెళ్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మద్దిరాలపాడు సమీపంలోని 216 జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాలు.. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మర్రిబోయిన గోపి(27) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అమ్మవారి కొలుపులు, వినాయక చవితి పండుగ నేపథ్యంలో గ్రామానికి వచ్చాడు. అదే గ్రామానికి చెందిన బత్తిన అరవింద్‌(19), మర్రిబోయిన మణికంఠ(21)లతో కలసి శనివారం రాత్రంతా గ్రామంలో జరిగిన అమ్మవారి కొలుపుల్లో సంతోషంగా గడిపారు. ఆదివారం వేకువజామున 4 గంటల సమయంలో ఒంగోలు వెళ్లి వినాయక విగ్రహానికి అడ్వాన్సు ఇచ్చారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో మద్దిరాలపాడు గ్రామం వద్ద 216 జాతీయ రహదారిపై పంక్చరు పడిన లారీ ఆగి ఉంది. దీనిని గమనించని యువకులు తమ మోటారు సైకిల్‌తో వెళ్లి బలంగా ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ భక్తవత్సల రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు.

పమిడిపాడులో విషాదఛాయలు..
గ్రామానికి చెందిన మర్రిబోయిన గోపి(30) ఐదేళ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది పాప ఉంది. మూడు రోజుల క్రితమే పాపకు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంతలోనే కొలుపులకు అని వెళ్లిన వ్యక్తి విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గోపీకి కవల సోదరుడు ఉన్నాడు. మర్రిబోయిన మణికంఠ(22) తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. తండ్రి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డిగ్రీ డిస్‌కంట్యూ చేసి ఖాళీగా ఉన్నాడు. వివాహం కాలేదు. బత్తిన అరవింద్‌(21) తల్లిదండ్రులకు రెండో సంతానం. వివాహం కాలేదు. తండ్రి గొర్రెల కాపరి. చేతికి అందివచ్చిన బిడ్డలను మృత్యువు కబళించడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement