రంగం సిద్ధం
పల్నాడులో
ఓఆర్‌ఆర్ భూ సేకరణకు
గుంటూరు జిల్లాలో 67.15 కిలోమీటర్లు..
● పల్నాడు జిల్లాలో 17 కిలోమీటర్లు...
● 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ...
● ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల
చేయనున్న జేసీ
● నందివెలుగు నుంచి కాజ వరకు
17.5 కిలోమీటర్ల లింక్ రోడ్డు
● జాతీయ రహదారితో అనుసంధానం....
సాక్షి ప్రతినిధి, గుంటూరు: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టు భూ సేకరణకోసం అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గుంటూరు, పల్నాడు జిల్లాలలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఓఆర్‌ఆర్ ఐదు జిల్లాలు, 23 మండలాలు, 97 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. 189.90 కిలోమీటర్ల మేర పరిధిలో ఓఆర్‌ఆర్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలో 67.15 కిలోమీటర్లు, పల్నాడులో 17 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఇప్పటికే ఎన్‌టీఆర్ జిల్లా తప్ప మిగిలిన నాలుగు జిల్లాలకు గెజిట్‌ను ప్రచురించింది. గుంటూరు జిల్లాకు ఆదివారం కేంద్రం గెజిట్‌ను ప్రకటించిది. పల్నాడు జిల్లాకు ఈ నెల ఏడున గెజిట్ వచ్చింది. గుంటూరు జిల్లాలో త్వరలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో 21 రోజులు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. దీంతోపాటు తెనాలి మండలం నందివెలుగు గ్రామం నుంచి జాతీయ రహదారి కాజ గ్రామం వరకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయనున్నారు.
● అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఐదు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల గుండా వెళ్లనుంది. గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలోని కాజ, చిన కాకాని గ్రామాలు, గుంటూరు నగరంలోని బుడంపాడు, ఏటుకూరు, పాతూరు, అంకిరెడ్డిపాలెం, మేడికొండూరు మండలం సిరిపురం, వరగాని, వెలవర్తిపాడు, మేడికొండూరు, డోకిపర్రు, విశదల, పేరేచర్ల, మందపాడు, మంగళగిరిపాడు, తాడికొండ మండలం పాములపాడు, రావెల, దుగ్గిరాల మండలం చిలువూరు, గొడవర్రు, ఈమని, చింతలపూడి, పెనుమూలి, కంఠంరాజు కొండూరు, పెదకాకాని మండలం నంబూరు, అనుమర్లపూడి, దేవరాయబొట్లపాలెం, తెనాలి మండలం కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు, కఠెవరం, సంగం జాగర్లమూడి, కొల్లిపర మండలం వల్లభాపురం, మున్నంగి, దంతలూరు, కుంచవరం, అత్తోట, చేబ్రోలు మండలం నారా కోడూరు, వేజెండ్ల, శుద్దపల్లి, చేకూరు, వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడు, అనంతవరప్పాడు, చమళ్లమూడి, కుర్నూతల గ్రామాల మీదుగా వెళ్లనుంది.
పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం ముస్సాపురం, పాటిబండ్ల, తాళ్లూరు, లింగంగుంట్ల, జలాల్‌పురం, కంభంపాడు, కాశీపాడు, అమరావతి మండలం ధరణికోట, లింగాపురం, దిడుగు, నెమలికల్లు గ్రామాల మీదుగా వెళ్తుంది. పల్నాడు జిల్లాకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. త్వరలో అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇప్పటికే ఆయా సర్వే నెంబర్లను ప్రకటించారు. ఈ సర్వే నెంబర్లలో క్రయవిక్రయాలు నిలిపివేయనున్నారు. సర్వే నెంబర్లలో రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో పెగ్ మార్కింగ్ చేస్తారు. అన్నీ పరిశీలించిన తర్వాతే కేంద్రం 3–డి నోటిఫికేషన్ జారీ చేస్తారు. భూసేకరణ ప్రక్రియ మొదలు కావడంతో ఓఆర్‌ఆర్ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది.


