కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం ఉత్తిదే
గుంటూరు మెడికల్: పేద ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఖరీదైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలకు ప్రభుత్వ వైద్యాధికారులు, ఆస్పత్రుల నిర్వాహాకులు తూట్లు పొడుస్తున్నారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించకుండానే అందించినట్లుగా ఆస్పత్రుల యజమానులు తప్పుడు రికార్డులు చూపెడుతూ పేదల ఉసురు పోసుకుంటున్నారు. వారి తప్పుడు పనులకు ప్రభుత్వ వైద్యాధికారులు అందినంత పుచ్చుకుని వత్తాసు పలుకుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ పెన్షనర్స్‌కు, వారి కుటుంబ సభ్యులకు, ఎంఎల్‌ఏలకు, మాజీ ఎంఎల్‌ఏలకు, ఇతర సిబ్బందికి వైద్య సేవలందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు, రిఫరల్ ఆస్పత్రుల నిర్వాహకులు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి. సదరు సర్టిఫికెట్‌ను పొందాలంటే ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రీటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్, 1972’ను తప్పనిసరిగా పాటించాలి. జిల్లాలో ఉన్న కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఈ నిబంధనలు అమలు కావటం లేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
నిబంధనలు ఇవీ....
తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారు, దారద్య్రరేఖకు దిగువున ఉన్న వ్యక్తులకు ఉచితంగా ప్రభుత్వ గుర్తింపు ఉన్న కార్పొరేట్, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలి. ఆస్పత్రిలో ఉన్న పడకల్లో ఐదుశాతం ఈ పేదల కోసం కేటాయించి అన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ఉచిత వైద్య సేవలను ఇవ్వాలి. అవసరమైతే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయాలి. ఓపీ సేవలు, వార్డు సేవలు కూడా ఉచితంగా అందించాలి. అంతేకాకుండా రెండు గ్రామాలను దత్తత తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి నెలా ఒక ఉచిత వైద్యశిబిరం సదరు గ్రామంలో ఏర్పాటుచేయాలి.
విద్యార్థులకు సైతం
ఉచిత వైద్యం...
కేవలం పెద్దవాళ్ళకే కాకుండా విద్యార్థులకు కూడా ఉచిత వైద్య సేవలను అందించాల్సి ఉంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు , ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, బీసీ వెల్ఫేర్ స్కూల్, ఎస్టీ హాస్టల్స్, ఎస్టీ ఆశ్రమ్ స్కూల్స్ విద్యార్థులకు, మాబడి స్కూల్స్ విద్యార్థులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలి. వీరితో పాటు ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్, జిల్లా రిఫరల్ కమిటీ, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ,ఇతర ప్రభుత్వ అధికారులు రిఫర్ చేసే విద్యార్థులకు కూడా గుర్తింపు ఉన్న ఆస్పత్రులు ఉచితంగా సేవలందించాలి. కానీ జిల్లాలో రెన్యూవల్ అయిన ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందించటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జీజీహెచ్ వైద్యుల
మొక్కుబడి తనిఖీలు
ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తున్నారో లేదో తనిఖీ చేసేందుకు విజయవాడకు చెందిన డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయం, జిల్లాకు చెందిన పలువురు వైద్యులు, వైద్యాధికారులను ముఖ్యంగా గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలకు చెందిన సీనియర్ వైద్యులను నియమిస్తుంది. తనిఖీ కోసం వెళ్లే వైద్యులకు, వైద్యాధికారులకు సదరు ఆస్పత్రి నిర్వాహాకులే కారు ఏర్పాటుచేసి, మధ్యాహ్నం స్టార్ హోటల్స్‌లో విందు ఏర్పాటుచేసి, తిరిగి వచ్చే సమయంలో భారీగానే తాయిలాలు ఇస్తున్నట్లు పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.
తప్పనిసరిగా
తనిఖీలు చేయాలి
ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు జిల్లాలో సుమారు 80 వరకు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో ప్రతి నెలా ఎంత మంది రోగులకు చట్ట ప్రకారం ఉచిత వైద్య సేవలను అందించారో పూర్తి వివరాలతో నివేదిక పంపించాల్సి ఉంది. అయితే కొన్ని ఆస్పత్రుల్లో తనిఖీల ఊసే లేదు. గతంలో విజిలెన్స్ అధికారులు కూడా ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్య సేవలను అందించటం లేదనే విషయాన్ని నిర్ధారించారు.
ఉచిత వైద్యం రికార్డులకే పరిమితం
పేదల ఉచిత సేవలకు మంగళం
సేవలను అందించకుండానే అనుమతులు
నిబంధనలు తుంగలో తొక్కుతున్న ఆస్పత్రుల నిర్వాహకులు


